ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆడుతున్న దేశాల్లో టెస్టు మ్యాచ్‌లకు ఆదరణ తగ్గుతుందని భావించిన ఐసీసీ.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే పలు టీమ్‌లు గడిచిన రెండేళ్ల కాలంలో ఆడిన టెస్టు మ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకుని వాటికి పాయింట్లను ఇచ్చారు. ఇక ఆ పాయింట్ల పట్టికలో భారత్, న్యూజిలాండ్‌లు వరుసగా 1, 2 స్థానాల్లో నిలిచాయి. దీంతో ఆ రెండు జట్లు త్వరలో తొలి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌ను ఆడనున్నాయి. అందులో గెలిచిన జట్టుకు వరల్డ్ టెస్టు చాంపియన్‌గా ట్రోఫీని అందజేస్తారు.
జూన్ 18వ తేదీ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్టు సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానంలో వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడతాయి. అయితే ముందుగా లండన్‌లోని లార్డ్స్ మైదానంలో మ్యాచ్‌ను నిర్వహించాలని అనుకున్నా తరువాత ఐసీసీ ఆ వేదికను రోజ్ బౌల్‌కు మార్చింది. టెస్టు చాంపియన్ షిప్లో భారత్ ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌ల ప్రకారం 520 పాయింట్లతో పట్టికలో తొలి స్థానంలో నిలిచింది. 420 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది. దీంతో టాప్ 2 లో నిలిచిన భారత్, న్యూజిలాండ్‌ల మధ్య టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు.
అయితే టెస్టులు అంటేనే సహజంగానే డ్రా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇక ఆడబోయేది టెస్టు చాంపియన్‌షిప్ మ్యాచ్. అది కూడా ఒక్కటే మ్యాచ్. మరి అందులో రెండు జట్లూ సమాన ప్రదర్శన కనబరిచి మ్యాచ్‌ను డ్రా చేసుకుంటే పరిస్థితి ఏమిటి ? విజేతగా ఎవరిని ప్రకటిస్తారు ? అంటే.. ఇప్పటి వరకు ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి టై-బ్రేకర్ ఫార్ములాను ప్రకటించలేదు. అంటే మ్యాచ్ డ్రా అయితే విజేతగా ప్రకటించడానికి జట్లకు ఇంకా ఏమైనా పరీక్ష పెడతారా ? అన్న వివరాలను ఐసీసీ వెల్లడించలేదు. టీ20లు, వన్డేల్లో అయితే సూపర్ ఓవర్ ఉంటుంది. కానీ టెస్టుల్లో అలాంటిది లేదు. అందువల్ల మ్యాచ్ డ్రాగా ముగిస్తే ఇరు జట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు. మరి టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ వరకు ఈ విషయమై ఐసీసీ ఏమైనా ప్రకటన చేస్తుందా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.