విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఫిట్‌నెస్, ఫామ్ కాపాడుకుంటూ ఉంటే 2027 వరల్డ్ కప్‌లోనూ ఆడే ఛాన్స్ ఉందని తెలిపాడు. టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ మొదటిసారి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. అతడితోపాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఉన్నాడు.
ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇవ్వడమే కీలకమని.. ప్రతి ఆటగాడిపై నమ్మకం ఉంచి వారిని ప్రోత్సహించేందుకు ప్రయత్నించడమే హెడ్ కోచ్‌గా తన విధి అని గంభీర్ తెలిపాడు. తన మద్దతు ఎప్పుడూ ఉంటుందనే ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నానని చెప్పాడు. ఏ విషయాన్ని సంక్లిష్టం చేయనని పేర్కొన్నాడు.
‘‘హార్దిక్ పాండ్య మాకు అత్యంత కీలకమైన ప్లేయర్. కెప్టెన్సీ నిర్ణయం తీసుకొనేటప్పుడు అన్ని మ్యాచ్‌లు ఆడగలరా? లేదా? అనేది ఆలోచించాం. అతడి నైపుణ్యాలను తక్కువ చేయడం లేదు. ఫిట్‌నెస్ విషయంలోనే అతడికి కాస్త సవాల్ ఎదురవుతుంది. నిర్ణయం తీసుకోవడంలో కోచ్, సెలక్టర్లకు ఇదే క్లిష్టంగా మారింది. వచ్చే టీ20 ప్రపంచకప్ మరో రెండేళ్లలో జరగనుంది. అందుకే సూర్యకుమార్ వైపు మొగ్గు చూపాం. తప్పకుండా సారథిగా విజయవంతమవుతాడని భావిస్తున్నాం’’ అని అజిత్ అగార్కర్ చెప్పుకొచ్చాడు.