దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా amla ఆటతీరు క్రికెట్ అభిమానులకు అందరికీ తెల్సిందే. ముఖ్యంగా వన్డే, టెస్టు ఫార్మాట్ లలో వికెట్ కోల్పోకుండా మంచి స్కోర్లు సాధిస్తూ ఇన్నింగ్స్ బిల్ట్ చేస్తుంటాడు ఆమ్లా. కాగా ఆమ్లా మరోసారి తన ఆటను అభిమానులకు గుర్తు చేసాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఓటమి అంచున ఉన్న తన జట్టును కాపాడాడు.
ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా, ఇంగ్లండ్ దేశవాళీ కౌంటీ క్రికెట్ లో సర్రే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సౌథాంప్టన్ వేదికగా హాంప్‌షైర్‌తో మ్యాచులో ఆమ్లా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ 488 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సర్రే జట్టు 72 పరుగులకే చాప చుట్టేసి తీవ్ర కష్టాల్లో పడింది. సర్రే మొదటి ఇన్నింగ్స్ లో 29 పరుగులు చేసిన ఆమ్లానే టాప్ స్కోరర్. ఇక ఫాలో ఆన్ లో ఆడుతూ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్రే జట్టు నాలుగో రోజు ఆట ముగిసేసరికి 6/2 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో పడింది.
అయితే నాలుగో స్థానంలో దిగిన ఆమ్లా ఆఖరి రోజంతా క్రీజులో నిలబడ్డాడు.తొలి 100 బంతుల్లో కేవలం 3 పరుగులే చేసి బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. మరో పక్క వికెట్లు పడుతున్నా ఆమ్లా మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. ఆమ్లా క్రీజులో నిలవడంతో సర్రే 122/8తో నిలిచి.. ఓటమి నుంచి తప్పించుకొని మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఆమ్లా మాత్రం 278 బంతులాడి 37 పరుగులతో అజేయంగా నిలిచి… హాంప్‌షైర్ జట్టు విజయంపై పెట్టుకున్న ఆశలపై నీళ్ళు చల్లాడు.