టీ20 ప్రపంచకప్ 2024 సాధించిన టీమిండియా విక్టరీ పరేడ్ ముంబయిలో అట్టహాసంగా జరిగింది. ముంబయి క్రికెట్ ఫ్యాన్స్ ఈ పరేడ్కు పండగలా దిగివచ్చారు. నారీమన్ పాయింట్ నుంచి వాంఖడె స్టేడియం వరకు ఈ పరేడ్ ఉత్సాహబరితంగా సాగింది. లక్షలాదిగా తరలివచ్చిన అభిమానులతో ఆ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. టీమ్ఇండియా ఆటగాళ్లు కూడా ఫ్యాన్స్ మధ్యలోని నుంచి వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకుని అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఓపెన్ టాప్ బస్సులోంచి రోహిత్ శర్మ, కోహ్లీ, ఇతర ప్లేయర్స్ అభిమానులకు అభివాదం చేస్తూ ఫుల్ జోష్ నింపారు.
విజయయాత్ర అనంతరం టీమ్‌ఇండియా ఆటగాళ్లు వాంఖడే స్టేడియానికి రాగా.. వారిని చూసేందుకు అభిమానులకు అవకాశం ఇవ్వడంతో స్టేడియం మొత్తం నిండిపోయింది. వేలాది మంది బయటే ఉండిపోయారు. వర్షం కురుస్తున్నా ఫ్యాన్స్ స్టేడియంలోనే నిరీక్షించారు. టీమ్‌ఇండియా స్లేడియం చేరుకున్నాక.. జాతీయ గీతం ఆలపించారు. తమకు ఎంతో మద్దతుగా నిలిచిన అభిమానులకు భారత జట్టు స్టేడియం చుట్టూ తిరుగుతూ అభినందనలు తెలిపింది. ముందే ప్రకటించినట్లుగా టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమ్‌ఇండియాకు బీసీసీఐ రూ.125 కోట్ల నజరానాను అందించింది.