సుమారు నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి వన్డేకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ తెలిపాడు. ఈనెల 18న ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ను ఆటగాళ్లు, అతిథులు, ప్రేక్షకులు ఆస్వాదించేలా నిర్వహిస్తామని చెప్పాడు.
ఈనెల 13 నుంచి 16 వరకు నాలుగు రోజుల పాటు సాయంత్రం 5 గంటల నుంచి పేటీఎం ద్వారా టికెట్లు విక్రయిస్తామని అజహర్ వివరించాడు. గతేడాది సెప్టెంబరులో టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ సందర్భంగా జింఖానా మైదానంలో తొక్కిసలాట నేపథ్యంలో ఈసారి ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్లు అమ్ముతామని స్పష్టంచేశాడు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినవాళ్లు 15వ తేదీ నుంచి ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియం దగ్గర టికెట్లను తీసుకోవచ్చని చెప్పాడు.