మాంచెస్టర్‌లో గత రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. స్టేడియంలో మ్యాచ్ కోసం వచ్చిన భారత్, పాక్ జట్లు వర్షం కారణంగా ఇండోర్ నెట్స్‌లోనే ప్రాక్టీస్ చేశాయి.
వన్డే ప్రపంచ కప్ వస్తుందంటే చాలు.. షెడ్యూల్‌లో అందరి కళ్లు ఒక్క మ్యాచ్ గురించే పదే పదే వెదుకుతుంటాయి. అదే.. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్.. ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాల్లో ఏ జట్ల పట్ల ఇంత ఆసక్తి ఉండదు. కానీ ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే కేవలం ఇరు దేశాల క్రికెట్ అభిమానులకే కాదు, ప్రపంచంలోని ఇతర దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులకు కూడా ఈ మ్యాచ్ ఒకింత ఆసక్తిని కలిగిస్తూనే ఉంటుంది. అయితే ఈ సారి ఉన్న పరిస్థితులు వేరు. అందుకనే ఇప్పుడు ఇరు జట్ల అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
పుల్వామా ఘటన అనంతరం భారత్ వరల్డ్ కప్ లో పాకిస్థాన్‌తో ఆడవద్దని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపించాయి. కానీ ఆడకపోతే భారత్‌కే నష్టమన్న పలువురు నిపుణులు సూచనలతో అభిమానులు తగ్గారు. దీంతో ఎట్టకేలకు వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుందని నిర్దారించారు. ఇక ఆ రోజు రానే వచ్చింది. ఇవాళ ఓల్డ్ ట్రాఫొర్డ్ మాంచెస్టర్‌లో భారత్ పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది. ఇప్పటికే టోర్నీలో విజయాల పరంపరతో దూసుకెళ్తున్న భారత్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుండగా.. అటు పాక్ మాత్రం నిలకడలేని ప్రదర్శన, విజయాలతో ఆందోళనగా ఉంది. ఈ క్రమంలో భారత్ కొంత గట్టిగా యత్నిస్తే ఈ మ్యాచ్‌లో పాక్‌పై కచ్చితంగా విజయం సాధించవచ్చని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.
చివరిసారిగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాక్ చేతిలో ఓడినా.. వరల్డ్ కప్‌లలో మాత్రం పాక్ భారత్‌ను ఇంకా బీట్ చేయలేదు. ఇప్పటి వరకు వరల్డ్‌కప్‌లలో 6 సార్లు భారత్, పాకిస్థాన్‌లు తలపడగా 6 సార్లూ ఇండియానే విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లలో సచిన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎక్కువ సార్లు ఎంపికై రికార్డు సృష్టించాడు. అయితే ఇవాళ జరగనున్న మ్యాచ్‌కు భారత్ అంతా సిద్ధంగానే ఉంది.. కానీ గాయం కారణంగా జట్టుకు దూరమైన ధావన్ స్థానంలో ఎవర్ని ఓపెనర్‌గా దింపాలా.. అని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ లేదా విజయ్ శంకర్‌లలో ఒకరికి ఆ చాన్స్ లభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
అయితే ఇవాళ పాక్‌తో జరగనున్న మ్యాచ్ నేపథ్యంలో భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది. ఒకటి ధావన్ స్థానంలో కేఎల్ రాహుల్ లేదా విజయ్ శంకర్‌లకు చాన్స్ ఇవ్వడం. రెండోది కుల్‌దీప్ యాదవ్‌కు బదులుగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకోవడం. కాగా కేఎల్ రాహుల్, విజయ్ శంకర్‌లలో కోహ్లి రాహుల్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తుండగా, అటు రవీంద్ర జడేజాను తీసుకుంటే అతను బ్యాట్, బంతి రెండింటితోనూ సత్తా చాటగలడు గనుక తుది జట్టులోకి అతన్ని కచ్చితంగా తీసుకుంటారని తెలిసింది.
ఇక ఇవాళ మ్యాచ్ జరగనున్న మాంచెస్టర్‌లో గత రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. స్టేడియంలో మ్యాచ్ కోసం వచ్చిన భారత్, పాక్ జట్లు వర్షం కారణంగా ఇండోర్ నెట్స్‌లోనే ప్రాక్టీస్ చేశాయి. అయితే ఇవాళ వర్షం లేదు. కానీ మ్యాచ్ జరిగే సమయంలో దట్టమైన మేఘాలు కమ్ముకుని రెండు, మూడు జల్లులు పడవచ్చని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో మ్యాచ్ జరుగుతుందా, లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొనగా, 50 ఓవర్ల మ్యాచ్ లేకపోయినా.. కనీసం 20 ఓవర్ల మ్యాచ్ అయినా ఉండేలా చూడాలని అభిమానులు వరుణ దేవున్ని ప్రార్థిస్తున్నారు.
అయితే భారత్, పాక్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అటు స్టార్ యాజమాన్యం ఈ మ్యాచ్ ద్వారా పెద్ద ఎత్తున డబ్బు ఆర్జించేందుకు ప్లాన్ వేసింది. కేవలం 10 సెకన్ల యాడ్ కే రూ.25 లక్షల మొత్తాన్ని వసూలు చేయాలని స్టార్ టీవీ ఆలోచిస్తున్నదట. దీంతో ఈ మ్యాచ్ ద్వారా రూ.100 కోట్లకు పైగానే ఆ టీవీకి ఆదాయం వస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే వర్షం వల్ల మ్యాచ్ అస్సలు జరగకపోతే స్టార్ టీవీకి పెద్ద ఎత్తున నష్టం వస్తుందని కూడా అంటున్నారు. దీంతో అటు ఆ టీవీ యాజమాన్యం కూడా వరుణుడు రావద్దని ప్రార్థిస్తోంది.
కాగా ఇవాళ జరగనున్న భారత్, పాక్ మ్యాచ్‌కు వేదికైన మాంచెస్టర్‌లో పిచ్ బ్యాటింగ్‌తోపాటు పేస్ బౌలింగ్‌కు ఎక్కువగా అనుకూలిస్తుందని మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. అయితే టాస్ గెలిచే ఏ జట్టు అయినా బౌలింగ్‌ను ఎంచుకునే అవకాశమే ఎక్కువగా ఉంటుందట. అదే జరిగితే భారత్ మొదట బౌలింగ్ చేస్తే పాక్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయాల్సి ఉంటుంది. అదే ఇండియా బ్యాటింగ్ చేస్తే ఈ పిచ్‌పై కనీసం 300 పరుగులు చేయాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. దాంతో రెండో సారి బ్యాటింగ్ కు దిగే జట్టుకు ఛేజింగ్ కష్టతరమవుతుందని వారి అభిప్రాయం. అయితే ఇవాళ్టి మ్యాచ్ లో వర్షం పడకుండా సాఫీగా జరిగితే గెలుపు ఏ జట్టును వరిస్తుందో చూడాలి..!
ఇండియా (ప్రాబబుల్ ఎలెవెన్): రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, విజయ్ శంకర్, ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్‌దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, జస్‌ప్రిత్ బుమ్రా
పాకిస్థాన్ (ప్రాబబుల్ ఎలెవెన్): ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, మహమ్మద్ హఫీజ్, సర్ఫరాజ్ అహ్మద్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, హసన్ అలీ, వహబ్ రియాజ్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ అమీర్.