భారత్ గోల్డెన్ బాయ్.. జావెలిన్ త్రో స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రా మరోసారి తన హవా చూపించాడు. మరో ఘనత సాధించి సత్తా చాటాడు. లుసానె డైమండ్ లీగ్ పోటీల్లో తన సూపర్ ఫామ్‌ను కొనసాగించి అగ్రస్థానంలో నిలిచాడు. గాయం నుంచి కోలుకుని ఈ టోర్నీలో పునరాగమనం చేసిన అతడు.. జావెలిన్‌ను 87.66 మీటర్లు విసిరి విజేతగా నిలిచాడు. హేమాహేమీలు బరిలో నిలిచిన ఈ పోటీల్లో నీరజ్.. తన తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. రెండో ప్రయత్నంలో 83.52 మీటర్లు, మూడో ప్రయత్నంలో 85.04 మీటర్లు బల్లెంను విసిరాడు.
అయితే నాలుగో ప్రయత్నంలో మళ్లీ నీరజ్ చోప్రా విఫలమయ్యాడు. ఐదో ప్రయత్నంలో మాత్రం బల్లెంను 87.66 మీటర్లు విసిరి ఒక్కసారిగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇక రెండో స్థానంలో నిలిచిన జర్మని అథ్లెంట్ జులియన్ వెబర్ 87.03 మీటర్లు బల్లెంను విసరగా, మూడో స్థానానికి పరిమితమైన జాకబ్ వాద్లిచ్ (చెక్ రిపబ్లిక్) 86.13 మీటర్ల దూరాన్ని విసిరాడు.