పారిస్ ఒలింపిక్స్-2024 క్రీడలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. శుక్రవారం నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు విశ్వక్రీడా సమరం సాగనుంది. 33వ ఒలింపిక్స్‌లో 200 పైగా దేశాల క్రీడాబృందాలు పాల్గొననున్నాయి. 10,500 మంది అథ్లెట్లు ఈ గేమ్స్లో తమ సత్తా చాటనున్నారు. రూ.80వేల కోట్ల పైగా వ్యయంతో ఒలింపిక్స్‌కు ఫ్రాన్స్ ఆతిథ్యమిస్తోంది. పారిస్ ఒలింపిక్స్-2024లో 117 మంది భారతీయులు పాల్గొననున్నారు. హరియాణా, పంజాబ్ నుంచే 43 మంది అథ్లెట్లు ఈ క్రీడల్లో సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. మరోవైపు ఏపీ నుంచి అయిదుగురు, తెలంగాణ నుంచి ముగ్గురు అథ్లెట్లు ఉన్నారు.
గత టోక్యో ఒలింపిక్స్-2020లో భారత్ ఏడు పతకాలను సాధించింది. భారత్ ఇంతవరకు సాధించిన ఒలింపిక్ మెడల్స్ సంఖ్య 35. భారత్ సాధించిన ఒలింపిక్ మెడల్స్‌లో 10 పసిడి పతకాలున్నాయి. హాకీలోనే ఎనిమిది స్వర్ణాలను భారత్ గెలుచుకుంది. మిగతా రెండింటిలో ఒకటి.. 2008 బీజింగ్ ఒలింపిక్స్ షూటింగ్‌లో అభినవ్ బింద్రా, టోక్యో క్రీడల్లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా బంగారు పతకాలు సాధించారు.