ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి కోచ్ పదవికి మరోమారు దరఖాస్తు చేసుకుంటారని సమాచారం అందుతుండగా.. మాజీ ప్లేయర్లు వీరేందర్ సెహ్వాగ్, మహేల జయవర్ధనే, ట్రెవర్ బేలిస్, టామ్ మూడీలు కూడా టీమిండియా కోచ్ రేసులో ఉన్నారని తెలిసింది.
ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో న్యూజిలాండ్ చేతిలో భారత్ పరాజయం పాలయ్యాక జట్టు కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలోనే కెప్టెన్ గా కోహ్లితోపాటు కోచ్ రవిశాస్త్రిని కూడా తప్పించాలని అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అయితే త్వరలో జరగనున్న వెస్టిండీస్ టూర్‌కు భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా కోహ్లిని కాకుండా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మను ఎంపిక చేస్తారని తెలుస్తుండగా.. త్వరలోనే భారత జట్టుకు కొత్త కోచ్‌ను కూడా నియమించనున్నారు. కాగా ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం కూడా ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే బీసీసీఐ టీమిండియా కోచ్ పదవి కోసం ఒక ప్రకటనను కూడా జారీ చేసింది. ఈ క్రమంలోనే టీమిండియాకు త్వరలో ఎంపిక కానున్న కొత్త కోచ్ ఎవరా..? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే టీమిండియా కోచ్ రేసులో ప్రస్తుతం ఐదుగురు బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి కోచ్ పదవికి మరోమారు దరఖాస్తు చేసుకుంటారని సమాచారం అందుతుండగా.. మాజీ ప్లేయర్లు వీరేందర్ సెహ్వాగ్, మహేల జయవర్ధనే, ట్రెవర్ బేలిస్, టామ్ మూడీలు కూడా టీమిండియా కోచ్ రేసులో ఉన్నారని తెలిసింది. వారి వివరాలను ఒకసారి పరిశీలిస్తే…
వీరేందర్ సెహ్వాగ్…
భారత క్రికెట్ అభిమానులకు చాలా పరిచయం ఉన్న పేరు. ఒకప్పుడు సచిన్ ఔటైతే సెహ్వాగ్ ఉన్నాడు కదా.. అని అభిమానులు భావించేవారు. ప్రత్యర్థి జట్టు బౌలర్ ఆత్మ విశ్వాసాన్ని గణనీయంగా దెబ్బతీయగలిగే ఏకైక బ్యాట్స్‌మన్ అన్న పేరు కూడా సెహ్వాగ్‌కు ఉంది. 2017లోనే సెహ్వాగ్ కోచ్ రేసులో నిలిచాడు. అయితే అతనికి ఏ జట్టుకూ కోచ్‌గా వ్యవహరించిన అనుభవం లేదు. దీంతోపాటు 2017లో కెప్టెన్ కోహ్లి కోచ్ గా రవిశాస్త్రికే మద్దతు పలికాడు. దీంతో సెహ్వాగ్ అప్పట్లో కోచ్ కాలేకపోయాడు. కానీ ఈసారి సెహ్వాగ్ కచ్చితంగా కోచ్ అవ్వాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
మహేల జయవర్ధనే…
టీమిండియా కోచ్ రేసులో మనకు బలంగా వినిపిస్తున్న మరొక పేరు మహేల జయవర్ధనే. ఇతను ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. ఇతని సారథ్యంలో ముంబై పలు సార్లు ఐపీఎల్ ట్రోఫీలను సాధించింది. దీంతోపాటు శ్రీలంక తరఫున వేల కొద్దీ పరుగులు సాధించిన మేటి బ్యాట్స్‌మెన్లలో జయవర్ధనే ఒకడు. అందుకనే టీమిండియా కోచ్ రేసులో మనకు జయవర్ధనే పేరు కూడా బాగా వినిపిస్తోంది.
ట్రెవర్ బేలిస్…
ప్రస్తుతం బేలిస్ ఇంగ్లండ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇతని సారథ్యంలోనే ఇంగ్లండ్ ప్రపంచ కప్ గెలిచింది. అయితే ఇతనికి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన అనుభవం లేకున్నా.. కోచ్‌గా చాలా అనుభవం ఉంది. దీంతో బేలిస్ కూడా టీమిండియా కోచ్ రేసులో నిలిచాడు.
టామ్ మూడీ…
ఆస్ట్రేలియాకు చెందిన మాజీ బ్యాట్స్‌మన్ టామ్ మూడీ పెద్దగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు. అయినా కోచ్‌గా మూడీకి అపార అనుభవం ఉంది. ఒకప్పుడు శ్రీలంక టీంకు ఇతను కోచ్‌గా వ్యవహరించాడు. 2007లో శ్రీలంకను వరల్డ్ కప్ ఫైనల్స్‌కు చేర్చాడు. అలాగే మూడీ పర్యవేక్షణలో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016 చాంపియన్‌గా అవతరించింది. ఇక 5 సార్లు హైదరాబాద్ జట్టు క్వాలిఫైర్ రౌండ్‌కు చేరుకుంది. ఇదంతా మూడీ చలవే. అందుకే ఇప్పుడు మూడీ కూడా టీమిండియా కోచ్ పదవికి పోటీ పడుతున్నారు. మరి వీరిలో కోచ్ పదవి ఎవర్ని వరిస్తుందో చూడాలి..!