శ్రీవారి పవిత్రోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ముందుగా సేనాధిపతిని సాయంత్రం వసంత మండపానికి వేంచేపు చేసి మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. అనంతరం సంపంగి ప్రాకారంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపట్టారు. తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి ఈ నెల పదో తేదీ వరకు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులోభాగంగా ఆదివారం ఉదయం శ్రీవారి మూలవిరాట్ ఎదురుగా ఆచార్య రుత్విక్‌వరణం నిర్వహించారు. భగవంతుని ఆజ్ఞ మేరకు అర్చకులకు బాధ్యతల కేటాయింపునే రుత్విక్‌వరణం అంటారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే ఉత్సవాల్లో అర్చకులు, యాత్రికుల వల్ల గానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే రాత్రి శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మూడురోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9.00 నుంచి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.