కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ రద్దైన సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం తగ్గితే టోర్నీని నిర్వహించాలని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దీంతో టోర్నీని నిరవధింగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కేంద్రం తాజాగా లాక్‌డౌన్ 4.0 నేపథ్యంలో పలు ఆంక్షలను సడలిస్తూ.. స్టేడియంలను ఓపెన్ చేసి క్రీడలను నిర్వహించుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో మరోసారి ఐపీఎల్‌పై ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఐపీఎల్‌ను ప్రస్తుతం నిర్వహిస్తారా, లేదా అన్నది మాత్రం సందేహంగానే మారింది.
కరోనా లాక్‌డౌన్‌కు ముందు టోర్నీని ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని చూశారు. కానీ అది వీలు కాలేదు. అయితే ఇప్పుడు లాక్‌డౌన్ 4.0 లో ప్రేక్షకులు లేకుండా క్రీడలు నిర్వహించుకోవచ్చని అనుమతులు ఇచ్చారు. దీంతో బీసీసీఐ ఇప్పుడీ విషయంపై పునరాలోచన చేస్తున్నట్లు తెలిసింది. అయితే టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నప్పటికీ.. అందులో పాల్గొనే విదేశీ ఆటగాళ్లు భారత్‌కు వచ్చేందుకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే.. విమాన సర్వీసులకు ఇంకా కేంద్రం అనుమతించలేదు. దీంతో విదేశీ ఆటగాళ్లు లేకుండానే ఐపీఎల్ టోర్నీ నిర్వహించాల్సి ఉంటుంది. మరి బీసీసీఐ ఆ నిర్ణయం తీసుకుంటుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
ఇక టోర్నీ వాయిదా పడడం వల్ల ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకే ఇష్టపడే అవకాశం ఉంది. ఎందుకంటే.. విదేశీ ఆటగాళ్లు రాకపోయినా సరే.. ఐపీఎల్ నిర్వహిస్తే.. కొంతలో కొంత నష్టాలను పూడ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి ఈ విషయంపై బీసీసీఐ ఏం ఆలోచిస్తుందనేది.. కొన్ని రోజులు ఆగితే తెలియనుంది.