వారెవ్వా.. చిన్నగదిలో మైక్రోగ్రీన్స్‌ పెంపకం.. నెలకు రూ.80వేలు సంపాదన..!

-

కొత్తగా ఏదో ఒకటి చేయాలనే తపన.. సంపాదించాలనే కాంక్ష.. ఇవి రెండూ ఉంటే చాలు.. ఎవరైనా సరే.. అద్భుతాలు చేయవచ్చు. అతను కూడా సరిగ్గా ఇదే చేశాడు. వ్యవసాయ కుటుంబం నుంచి రాకపోయినా.. వ్యవసాయం చేయడం తెలియకపోయినా.. దాని గురించి ఆసక్తి పెంచుకున్నాడు. కొత్త పద్ధతిలో ఏవైనా పండించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన ఆలోచనను అమలు చేశాడు. అంతే తక్కువ కాలంలోనే అతను నెలకు రూ.80వేలు సంపాదించడం మొదలు పెట్టాడు. ఇంతకీ అతనెవరు..? ఏం చేశాడంటే..?

అతని పేరు విద్యాధరన్‌ నారాయణ్‌. చెన్నై వాసి. వ్యవసాయం మీద మక్కువతో అతను ఆ కుటుంబం నుంచి రాకపోయినా కొంత స్థలాన్ని కొనుగోలు చేసి అందులో పంటలను సాగు చేయడం మొదలు పెట్టాడు. కానీ చాలా స్వల్పమైన లాభాలు మాత్రమే వచ్చేవి. అది వీలుకాదని చెప్పి అతను ట్రావెల్స్‌ బిజినెస్‌ మొదలు పెట్టాడు. అందులో నష్టాలను చవి చూశాడు. అయితే చివరకు అతనికి ఓ ఆలోచన తట్టింది. వ్యవసాయాన్ని కొత్త పద్ధతిలో చేస్తే ఎలా ఉంటుంది..? అని అనుకున్నాడు. వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టాడు. ఓ చిన్న గదిని తీసుకుని అందులో కేవలం రూ.15వేల పెట్టుబడితో మైక్రోగ్రీన్స్‌ను పండించడం మొదలు పెట్టాడు.

సాధారణంగా కూరగాయలు, ఆకుకూరల విత్తనాలను నాటాక అవి సుమారుగా 10 నుంచి 15 రోజుల్లో చిన్న చిన్న మొక్కలుగా మారుతాయి. ఈ క్రమంలో వాటిని కత్తిరించి సేకరిస్తారు. ఇలా సేకరించిన మొక్కలనే మైక్రోగ్రీన్స్‌ అంటారు. వీటిని రెస్టారెంట్లలో బాగా ఉపయోగిస్తారు. పలు రకాల వంటలు, సలాడ్లలో వీటిని వాడుతారు. వీటిలో సాధారణ కూరగాయాల్లో కన్నా ఐరన్‌, జింక్‌, కాపర్‌, పొటాషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే ప్రస్తుతం మైక్రోగ్రీన్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఈ మార్కెట్‌ను పసిగట్టిన నారాయణ్‌ వెంటనే వీటిని పండించడం మొదలు పెట్టాడు. అంతే.. నెలకు అతను రూ.20వేల ఆదాయంతో మొదలై ఇప్పుడు నెలకు రూ.80వేలు సంపాదించే వరకు చేరుకున్నాడు.

ప్రస్తుతం నారాయణ్‌ తన చిన్న గదిలో నెలకు సుమారుగా 50 కిలోల వరకు మైక్రోగ్రీన్స్‌ను పండిస్తున్నాడు. వాటిని చెన్నైలోని రెస్టారెంట్లు, సూపర్‌ మార్కెట్లకు సరఫరా చేస్తున్నాడు. ఇక అతను 2018 అక్టోబర్‌లో తన వ్యాపారం వృద్ధి చెందుతున్న నేపథ్యంలో శక్తి మైక్రోగ్రీన్స్‌ అని ఓ కంపెనీని ఏర్పాటు చేసి దాని ద్వారా మైక్రోగ్రీన్స్‌ను అమ్ముతున్నాడు. కాగా ప్రస్తుతం అతను పాలకూర, టమాటా, క్యాబేజీ, పొద్దు తిరుగుడు, ముల్లంగి, బీట్‌రూట్‌ తదితర 18 రకాలకు పైగా కూరగాయలు, ఆకుకూరలు, విత్తనాలకు చెందిన మైక్రోగ్రీన్స్‌ను పండిస్తున్నాడు. త్వరలోనే నెలకు 200 కిలోల మైక్రోగ్రీన్స్‌ను పండించడమే అతను లక్ష్యంగా పెట్టుకున్నాడు. అవును మరి.. వినూత్నంగా ఆలోచిస్తే ఎవరైనా సరే.. నారాయణ్‌ లాగానే వృద్ధి చెందవచ్చు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version