జూన్ 2న జరగనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులతో సీఎస్ ఇవాళ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూన్ 2న ఉదయం గన్ పార్క్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తారని వెల్లడించారు.
అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారని తెలిపారు. జూన్ 2 రాత్రి 7 గంటల నుండి 9 వరకు ట్యాంక్ బండ్‌పై కళారూపాల కార్నివాల్ ఉంటుందని ,5 వేల మంది శిక్షణ పోలీసులు బ్యాండ్ ప్రదర్శన చేస్తారన్నారు. అదే విధంగా ట్యాంక్ బండ్‌పై హస్త కళలు, చేనేత కళలు స్టాళ్లు, స్వయం సహాయక బృందాల స్టాళ్లు, నగరంలోని ప్రముఖ హోటళ్ల ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేస్తామని ,పిల్లలకు క్రీడలతో కూడిన వినోదశాలలతో పాటు, బాణాసంచా, లేజర్ షో ఈవెంట్ ఉంటుందని తెలిపారు. అయితే, సోనియా గాంధీ వస్తారా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.