కరోనా వైరస్ లేదా కోవిడ్-19.. ఎప్పుడు.. ఎవరిని.. ఎలా కబళిస్తుందో అర్థంకాక ప్రజలు తీవ్ర భయాందోళనలో బతుకుతున్నారు. ఈ మహమ్మారికి పేదోడు.. ఉన్నోడు అని తేడా ఉండదు. చిన్నా.. పెద్దా అని జాలి చూపదు. ఎవడైనా.. ఎంతటివాడైనా ఈ రక్కసి ముందు తల దించాల్సిందే అన్నట్టు ప్రస్తుత పరిస్థితి చెప్పకనే చెబుతోంది. ప్రస్తుతం కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ లేకపోవడంతో.. ప్రపంచదేశాలకు నివారణ ఒక్కటే ముందున్న మార్గంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అనేక దేశాలు లాక్‌డౌన్ విధించడంతో పాటు కఠన చర్యలు కూడా తీసుకుంటున్నాయి.
అయితే ఇలాంటి విపత్కర సమయంలో కొన్ని కొన్ని సంఘటనలు హృదయాలకు తాకడమే కాకుండా స్పూర్తిని కలిగించేలా ఉంటాయి. ఇక ఓ వైపు కోవిడ్ చికిత్స పొందుతూ.. మరోవైపు పరీక్షలు రాసింది ఓ విద్యార్థిని. తమిళనాడులో ఈ సంఘటన జరిగింది. పూర్తివివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన ఓ యువతి విదేశంలో ఉన్నత చదువులు అభ్యసిస్తుంది. అయితే కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి ఆమె భారత్‌కు వచ్చేసింది. ఆ తరువాత ఆసుపత్రిలో టెస్ట్ చేయించుకోగా కరోనా నెగిటివ్ వచ్చింది.
కానీ, మూడు రోజుల తర్వాత ఆమెతో వచ్చిన స్నేహితులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుసుకోగా.. ఎందుకైనా మంచిదని తనకు కరోనా లక్షణాలు కనిపించకపోయినా టెస్టులు చేయింది. ఈ క్రమంలోనే ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో.. చికిత్స కొరకు హాస్పటల్‌లో చేరింది. దీంతో కుటుంబానికి దూరమైనా ఆమె తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఇక ఇదే టైమ్‌లో తన యూనివర్సిటీలో పరీక్షల సమయం. అయితే ఈ పరీక్షలను ఎలాగైనా పూర్తి చేయాలని నిర్ణయించుకున్న ఆ విద్యార్థి.. హాస్పటల్‌లోనే ఆన్‌లైన్‌లో రెగ్యులర్‌గా క్లాస్‌లను వింటూ పరీక్షలకు సన్నద్ధమైంది.
అలా హాస్పటల్‌లోనే నాలుగు పరీక్షలను ఆన్‌లైన్ పూర్తి చేసింది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం కూడా కుదుటపడింది. రెండు పరీక్షల్లో నెగిటివ్ రావడంతో.. ఆమెను డిశ్చార్జ్ కూడా చేశారు. ఇలా చివరకు ఆమె మనోధైర్యం ముందు కరోనా మహమ్మారి నిలబడలేకపోయింది. సో.. దీనిని బట్టీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే.. మన ధైర్యమే మనల్ని రక్షిస్తుంది. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మనోధైర్యాన్ని కోల్పోకుండా పోరాడితే.. ఎంతటివాడైనా తలదించాల్సిందే..!!