గడిచిన నాలుగు రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ప్రభుత్వంపై విమర్శలు వస్తు న్నాయి. నిజానికి ఎప్పుడూ ప్రతిపక్షాలు చేసే విమర్శలు మామూలే అయినప్పటికీ.. మేధావి వర్గం నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణాలేంటి? నిజంగానే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివాదం అవుతున్నాయా ? లేక ఉద్దేశ పూర్వకంగానేవివాదం చేస్తున్నారా ? అనే విషయం తెరమీదికి వస్తోంది. విషయంలోకి వెళ్తే.. నాలుగు రోజుల కిందట విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి డాక్టర్ భాస్కర్ వివాదం తెరమీదికి వచ్చింది. ఆయన ఎనస్థీషియన్. అయితే, కరోనా రోగులు కానప్పటికీ..తానువైద్యం చేయాలంటే.. మాస్కులు కావాలని పీపీఈలు ఇవ్వాలని ఆయన వాదించారు.
నిజానికి ఈ కొరత ఏపీలోనే కాదు.. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఉంది. అయినప్పటికీ.. ఏపీ ప్రభుత్వం సాధ్యమైనంత వరకు వీటిని అందించే ప్రయత్నం చేస్తున్నా.. సదరు డాక్టర్ మాత్రం మీడియాకు ఎక్కారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన లక్ష్మణ రేఖ దాటారు. ఆయన తన అభిప్రాయాన్ని ఏదైనా సరే.. ప్రభుత్వానికి విన్నవించుకునే మార్గాలు ఉన్నా.. వాటిని పట్టించుకోకుండా మీడియాకు ఎక్కేశారు. ఇక, చిత్తూరు జిల్లా నగరి మునిసిపల్ కమిషనర్ వెంకట్రామి రెడ్డి కూడా స్థానిక సమస్యలను ప్రభుత్వానికి సరైన మార్గంలో చేరవేయడం మానేసి.. సోషల్ మీడియా వేదికగా వాటినిఏకరువు పెట్టారు.
నిజానికి ఈ ఇద్దరు చేసింది కూడా రూల్స్ కు విరుద్ధం. పైగా ప్రభుత్వాన్ని విమర్శించడం మరింతగా తప్పు. ఈ సమయంలో ఏ ప్రభుత్వమైనా.. ఇలాంటి చర్యలే తీసుకుంటుంది. వెంటనే స్పందించిన ప్రభుత్వం వారిద్దరిపైనా సస్పెన్షన్ వేటు వేసింది. అయితే, దీనిని కావాలనే ఉద్దేశంతోనే టీడీపీ నాయకులు వివాదం చేస్తన్నారనే వాదన ఉంది. నిజానికి చంద్రబాబు హయాంలోనూ ఇలాంటి సందర్భాలు వచ్చాయి. దీంతో అప్పటి అధికారులను కూడా ఇలానే సస్పెండ్ చేయకుండా.. వెంటనే అక్కడి నుంచి బదిలీ చేసిన సందర్భాలు ఉన్నాయి.
అయితే, ఆయా విషయాల్లో ప్రభుత్వం ఇలానే స్పందించాలని ఎక్కడా రూల్ లేదు. ప్రభుత్వ విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. మరి ఈ విషయం తెలిసి ఉండి కూడా చంద్రబాబు వంటి మేధావులు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న అధికారులను సమర్ధించడం శోచనీయం అంటున్నారు పరిశీలకులు. అదే తన ప్రభుత్వమైతే.. ఇలానే స్పందదిస్తారా? అంటున్నారు.