క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి తెరకెక్కబోతున్న పుష్ప సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని కళ్ళల్లో వత్తులు వేసుకుని వేచి చూస్తున్న అభిమానుల ఆశలపై కరోనా మహమ్మారి నీళ్లు చల్లింది. ఈ సినిమా ఎర్రచందనం అక్రమ రవాణా బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా కేరళ రాష్ట్రం చిత్రీకరణకు బాగా సూట్ అవుతుందని భావించిన సుకుమార్… కేరళలోనే షూటింగ్ పూర్తి చేయాలని ఓ ప్రణాళిక రూపొందించుకున్నారు. కానీ కరోనా వ్యాప్తి కారణంగా అనవసరంగా రిస్కు తీసుకోకూడదని భావించిన అల్లు అర్జున్, అల్లు అరవింద్ కేరళ రాష్ట్రానికి వెళ్లి చిత్రీకరణ జరిపే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు.
రాజమండ్రి లేదా హైదరాబాద్ నగరంలోని ఏదో ఒక మంచి లోకేషన్ ఎంచుకొని చిత్రీకరణ పూర్తి చేద్దామని సుకుమార్ ని ఒప్పించడానికి కూడా ప్రయత్నించారు. కానీ తన సినిమా విషయంలో అస్సలు కాంప్రమైజ్ కానీ సుకుమార్ చిత్రీకరణ జరిపితే కేరళ రాష్ట్రంలోనే జరుపుతామని లేకపోతే సినిమానే మానేద్దాం అని మొండికేసి కూర్చున్నారు. దాంతో చేసేదేమీ లేక అల్లు అర్జున్, అల్లు అరవింద్ కూడా కేరళ రాష్ట్రంలోనే షూటింగ్ జరిపేందుకు పచ్చజెండా ఊపేశారు. సో, చివరికి ఈ రంగస్థలం డైరెక్టర్ తన పంతం నెగ్గించుకున్నట్టైంది. ఇకపోతే సినిమా చిత్రీకరణ కేరళలోని కొన్ని మంచి లొకేషన్లలో ప్రారంభం కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికాలంలో విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.