సన్ ఫార్మాసూటికల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మంగళవారం ఫ్లుగార్డ్ పేరిట కరోనా మెడిసిన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఫావిపిరవిర్ 200 మిల్లీగ్రాముల మెడిసిన్ ఇందులో ఉంటుంది. దీన్ని స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్న కోవిడ్ పేషెంట్ల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. ఈ మెడిసిన్ ఒక్క ట్యాబ్లెట్ ధరను రూ.35గా నిర్ణయించారు.
దేశంలో స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్న కోవిడ్ పేషెంట్ల చికిత్సకు భారత ప్రభుత్వం ఇది వరకే ఫావిపిరవిర్ మెడిసిన్ ఉపయోగానికి అనుమతులు ఇచ్చింది. కరోనా చికిత్సకు అందుబాటులో ఉన్న యాంటీ వైరల్ ఔషధాల్లో ఇదొకటి. ఈ సందర్భంగా సన్ ఫార్మా ఇండియా బిజినెస్ సీఈవో కీర్తి గనోర్కర్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా నిత్యం 50వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయని అన్నారు. అందవల్ల అటు వైద్య నిపుణులతోపాటు కరోనా మెడిసిన్లు కూడా జనాలకు అవసరం అవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఫ్లుగార్డ్ పేరిట కరోనా మెడిసిన్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.
ఫ్లుగార్డ్ మెడిసిన్ పేషెంట్లందరికీ లభ్యమయ్యేలా చూస్తామని తెలిపారు. ఇందుకు గాను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో తాము పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతి పెద్ద జనరిక్ ఫార్మాసూటికల్ కంపెనీల్లో సన్ ఫార్మా 4వ స్థానంలో ఉండగా.. దేశంలో మొదటి స్థానంలో ఉంది.