ఏపీ బీజేపీ ఇన్ఛార్జీ సునీల్ దేవధర్ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. దివంగత ఎన్టీఆర్ చాలా గొప్ప వ్యక్తి అని, బాహుబలి వంటి ఆయనను కట్టప్ప మాదిరి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని సునీల్ దేవధర్ విమర్శించారు. ఈ విషయాన్ని తాను తొలిసారి చెపుతున్నానని సునీల్ దేవధర్ అన్నారు. 2014లో బీజేపీతో కలిసి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని… ఆ తర్వాత బీజేపీని వెన్నుపోటు పొడిచి బయటకు వెళ్లిపోయారని చెప్పారు సునీల్ దేవధర్. చంద్రబాబు వద్దని జగన్ ను ప్రజలు ఎన్నుకుంటే పరిస్థితి మరింత దిగజారిందని, రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయిందని సునీల్ దేవధర్ అన్నారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ బాగానే పని చేశారు… ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పటికీ వాస్తవాలను మాట్లాడాలని చెప్పారు. సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందని కితాబునిచ్చారు. ప్రజాపోరు యాత్ర ద్వారా పార్టీని వీర్రాజు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారని చెప్పారు. ఇప్పుడు పురందేశ్వరి నాయకత్వంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ – జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.