భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండడంతో రోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా రోజుకు 3.50 లక్షల కేసులు నమోదవ్వగా ఇప్పుడది 4 లక్షలకు చేరుకుంది. ఈ క్రమంలోనే పలు దేశాలు ఇప్పటికే భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించారు. అయితే ఈ నిషేధానికి కొన్ని గంటల ముందే అధిక సంఖ్యలో ప్రైవేట్ చార్టర్డ్ విమానాలు ఇతర దేశాలకు వెళ్లాయి.
ఏప్రిల్ 23వ తేదీ నుంచి యూకే భారత విమానాలపై నిషేధం విధించగా అంతకు 24 గంటల ముందే కొన్ని ప్రైవేట్ జెట్‌లు బ్రిటన్‌కు వెళ్లాయి. ఇందుకు గాను ఒక్కో జెట్‌కు 1 లక్ష పౌండ్లు (దాదాపుగా రూ.1 కోటి) చెల్లించారని తెలిసింది. సంపన్నులు అంత భారీ మొత్తంలో చెల్లించి ఇండియా నుంచి యూకేకు వెళ్లిపోయారు.
ఇక మే 4వ తేదీ నుంచి అమెరికా కూడా విమానాలను నిషేధించనుండడంతో అమెరికాకు భారీ మొత్తంలో టిక్కెట్‌కు వెచ్చించి మరీ సంపన్నులు భారత్ నుంచి వెళ్లిపోతున్నట్లు సమాచారం. ఒక్క వన్ వే టిక్కెట్ ధర రూ.7 లక్షలు పలుకుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇప్పటికే పెద్ద ఎత్తున సంపన్నులు విదేశాలకు వెళ్లిపోయారని తెలుస్తోంది. భారత్‌లో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతుండడంతోనే వారు దేశాలు దాటి వెళ్తున్నారని ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు చెబుతున్నాయి.