దేశంలో కొన్ని చోట్ల జరుగుతున్న బలవంతపు మత మార్పిళ్లపై సుప్రీంకోర్టు స్పందించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని ఆందోళన వ్యక్తం చేసింది. బలవంతపు మత మార్పిళ్లను గుర్తించి నివారించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇలాంటి చర్యలను అరికట్టకపోతే అత్యంత క్లిష్టమైన పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించింది.
దేశంలో బలవంతపు, మోసపూరిత మత మార్పిళ్లను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరిపిన జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
‘‘ఇది చాలా తీవ్రమైన విషయం. బలవంతపు మత మార్పిళ్లను అరికట్టేందుకు కేంద్రం చిత్తశుద్ధితో పనిచేయాలి. లేదంటే చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేశ భద్రత, మత స్వేచ్ఛను ప్రభావితం చేసే సమస్య ఇది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం తక్షణమే దీనిపై చర్యలు చేపట్టాలి’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలాంటి మతమార్పిళ్లను అరికట్టేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సూచించింది.