కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్చి నుంచి ఆగస్టు వరకు రెండు విడతలుగా లోన్ చెల్లింపుదారులకు మారటోరియం తీసుకునే సదుపాయం కల్పించిన విషయం విదితమే. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో తొలి విడుత మారటోరియం కల్పించారు. జూన్, జూలై, ఆగస్టు నెలలకు రెండో విడుత మారటోరియం సదుపాయం అందించారు. అయితే వచ్చే నెల నుంచి యథావిధిగా రుణ చెల్లింపుదారులు ఈఎంఐలను చెల్లించాల్సి ఉంటుంది. కాగా మారటోరియం పొందిన లోన్లకు గాను వడ్డీని చెల్లించాలా, వద్దా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఏమిటో తెలపాలని సుప్రీం కోర్టు బుధవారం ప్రశ్నించింది.
మారటోరియం పొందిన లోన్లకు వడ్డీ ఉంటుందని, దాన్ని మాఫీ చేయలేమని ఆర్‌బీఐ గతంలోనే చెప్పింది. అయితే దీనిపై కొందరు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. లాక్‌డౌన్ వల్ల అప్పులపాలైన తమకు లోన్ చెల్లింపులకు మారటోరియం ఇచ్చినా.. వడ్డీని కట్టమని అంటున్నారని, ఇది న్యాయం కాదని, కనుక తమకు న్యాయం చేయాలని కోరుతూ కొందరు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. వారి వాదనలను విన్న అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఈ విషయంపై ప్రశ్నించింది.
మారటోరియం పొందిన లోన్లకు వడ్డీ చెల్లించాలని ఆర్‌బీఐ చెప్పిందని, కానీ ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలపాలని, ఆర్‌బీఐ వెనుక దాక్కుంటామంటే కుదరదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కేంద్రం ఈ విషయంపై తమ నిర్ణయాన్ని సెప్టెంబర్ 1వ తేదీ వరకు తెలపాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మారటోరియం వల్ల లోన్ల కాలపరిమితి పెరుగుతుందని, కానీ వడ్డీని మాత్రం చెల్లించాలని లేదంటే బ్యాంకులు తీవ్రంగా నష్టపోతాయని ఆర్‌బీఐ గతంలో తెలిపింది. అయితే దీనిపై సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.
మీరు లాక్ డౌన్ విధించారు కనుక ఆర్‌బీఐ మారటోరియం సదుపాయం ఇచ్చిందని.. కనుకనే ఈ సమస్య వచ్చిందని.. కాబట్టి మారటోరియం పొందిన లోన్లపై మార్చి నుంచి ఆగస్టు వరకు వేసిన వడ్డీని చెల్లించాలా, వద్దా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని, కేంద్రం తన వైఖరిని తెలపాలని కోర్టు ఆదేశించింది.