గత నెల రోజులకు పైగా దేశ రాజకీయాల్లో మహా పాలిటిక్స్ పెను ప్రకంపనలు రేపుతోంది. ఎన్నో ట్విస్టులు… ఉత్కంఠ… ప్రతి రోజు ఎప్పుడు ఏం జరుగుతుందో ? ఎవరు ఎవరితో కలుస్తారో ? కూడా ఊహించని పరిస్థితిని మనం చూస్తున్నాం. తాజాగా ఎన్సీపీ – శివసేన – కాంగ్రెస్ కూటమి అక్కడ దాదాపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అందరూ అనుకుంటున్న టైంలో ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ బీజేపీకి సపోర్ట్ చేయడంతో ఆఘమేఘాల మీద రాత్రికి రాత్రే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగాను, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అందరికి షాక్ ఇచ్చారు.
ఇక బలపరీక్షలో ఎవరు నెగ్గుతారో ? అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ టైంలో మహారాష్ట్ర పొలిటికల్ సీన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం కీలకమైన తీర్పు వెల్లడించింది. బీజేపీకి సర్వోన్నత న్యాయస్ధానంలో చుక్కెదురైంది. దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం రేపు సాయంత్రం ఐదు గంటలకు బలనిరూపణ చేసుకోవాలని స్పష్టం చేసింది. అంటే బుధవారం సాయంత్రం ఐదు గంటలకు అసెంబ్లీ సాక్షిగా బలపరీక్ష ఉంటుంది.
ఈ బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ ఎస్వీ.రమణ ఈ తీర్పు చదివి వినిపించారు. తీర్పు ప్రకారం రేపు సాయత్రం ఐదు గంటల లోపే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలని… ఆ వెంటనే ప్రొటెం స్పీకర్‌ను కూడా ఎన్నుకోవాలని… రహస్య ఓటింగ్ లేదని.. రేపే బలపరీక్షకు ఎదుర్కోవాలని కూడా ఫడ్నవీస్‌కు కోర్టు తెలిపింది. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని కూడా కోర్టు ఈ సందర్భంగా సూచించింది.
ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు నిర్ణయంతో అటు ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ శిబిరంలో ఎక్కడా లేని జోష్ నెలకొంది. బలపరీక్ష జరిగే వరకూ తమ ఎమ్మెల్యేలు చేజారకుండా మూడు పార్టీలు చర్యలు చేపట్టగా, ఎన్సీపీ చీలిక వర్గ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో బలపరీక్షలో బయటపడాలని బీజేపీ యోచిస్తోంది. ఏదేమైనా రేపు బలపరీక్ష జరిగి.. ఫలితం వచ్చేవరకు మహా పాలిటిక్స్‌పై ఈ ఉత్కంఠ తప్పదు.