అసహజ శృంగారం నేరమే..
పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం చారిత్రక తీర్పుని వెల్లడించింది. వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 377 చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్ర నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నేడు తుది తీర్పుని వెలువరించింది. ‘లైంగిక స్వభావం ఆధారంగా ఒకరిపై పక్షపాతం చూపించడం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లే అని వెల్లడించింది. ఎల్జీబీటీ వర్గానికి చెందిన వ్యక్తులకు సాధారణ పౌరులకు ఉండే హక్కులే ఉంటాయని తెలిపారు. అయితే జంతువులతో సంపర్కం జరిపితే తీవ్ర నేరంగా పరిగణించి పదేళ్ల వరకు జైలుశిక్ష లేదా జీవితఖైదు విధించవచ్చన్నారు.
2001లో నాజ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ సెక్షన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. నాడు ఢిల్లీ హైకోర్టు ఈ తరహా లైంగిక చర్యను నేరంగా పరిగణించకూడదని తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పుని 2013లో సుప్రీం కోర్టు రద్దుచేసింది. దీంతో తాజాగా స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు సెక్షన్ 377 చట్టబద్ధతను సవాల్ చేస్తూ మరోసారి సుప్రీం ను ఆశ్రయించగా..తాజాగా స్వలింగ సంపర్కం నేరం కాదంటూ తీర్పుని వెల్లడించింది.