హైదరబాద్ లో తాజాగా కురిసిన వర్షాలు ఫలితంగా వచ్చిన వరదలు కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా కొత్త ఉత్సహాన్ని ఇచ్చినట్లున్నాయి! ఇంతకాలం రాష్ట్రం మొత్తం ఒకలా గ్రేటర్ లో మరోలా కాస్త బలహీనంగా సాగినట్లు అనిపించిన కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు.. తాజా వరదలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి! ఫలితంగా అధికార తెరాస పై సామాన్యుడికి సైతం అర్ధం అయ్యేస్థాయిలో విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.. ఫలితంగా కారుని ఇబ్బందిపెడుతున్నారు!!
అవును… గ్రేటర్ లో వర్షాల వల్ల వచ్చిన వరదలకు జనజీవనం అస్థవ్యస్థమైన సంగతి తెలిసిందే! అధికారపార్టీ పైకి 10మదే చనిపోయినట్లు చెబుతున్నా… సుమారు 100వరకూ ప్రాణాలు కోల్పోయారని, తమ వద్ద పక్కా సమాచారం ఉందని చెబుతున్నారు టి.కాంగ్రెస్ నేతలు! సోయి లేకుండా, ఇష్టారాజ్యంగా డబ్బులు ఖర్చు చేసి జీహెచ్‌ఎంసీని అప్పులు మయం చేశారు.. గ్రేటర్ హైదరాబాద్ ని గాలికి వదిలేశారు.. అంటూ అధికారపార్టీపై విరుచుకుపడుతున్నారు!
ఈ విషయాలపై తాజాగా మైకందుకున్న ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్… “వర్షాలు ప్రతి ఏటా పడాతాయి. గతంలో కూడా పెద్ద పెద్ద వర్షాలు, వరదలు వచ్చాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎంత సిద్దంగా వున్నాయన్నది ముఖ్యం.. ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమవడంలో విఫలమయ్యారు.. కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయలేకపోయారు.. అవసరమైన చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడలేకపోయారు..” అంటూ ఫైరవుతున్నారు!
ఇదే క్రమంలో మరింత కంటిన్యూ చేస్తూ… “భారీ వర్షాల వల్ల చనిపోయిన వారి సంఖ్య విషయంలో కూడా ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తుంది. కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వంద మంది వర్షానికి మరణించినట్లు తమకు నిర్దిష్టమైన సమాచారం వుంది. కానీ ప్రభుత్వం చనిపోయిన వారి లెక్కలు కూడా సరిగ్గా చెప్పడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలివి లేదు, సిగ్గూ లేదు” అని అధికార తెరాసపై విమర్శల వర్షం కురిపించారు!! ఏది ఏమైనా… తాజాగా వచ్చిన వర్షాలు వరదల వల్ల అధికార పార్టీ ఇరుకునపడగా, రాజకీయంగా కాంగ్రెస్ కు కొత్త ఊపొచ్చిందని అంటున్నారు విశ్లేషకులు!