ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా పలువురు తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనాపై పోరులో భాగంగా దాతలు పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళాలు పంపాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. దీంతో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల నుంచే కాకుండా సామాన్యుల నుంచి కూడా పీఎం కేర్స్‌కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు దాతలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. విరాళాలను నేరుగా తమ అకౌంట్లలోని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.
పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళాలు ఇవ్వదలచిన వారు.. ఎస్‌బీఐ న్యూఢిల్లీ మెయిన్ బ్రాంచ్‌లోని పీఎం కేర్స్ అకౌంట్‌కు డబ్బులు బదిలీ చేయాలని మోదీ కోరారు. అందుకు సంబంధించిన అకౌంట్ వివరాలను కూడా వెల్లడించారు. అలాగే యూపీఐ ఐడీ కూడా ఇచ్చారు. దీంతో సైబర్ నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకున్నారు. పీఎం కేర్స్ అకౌంట్‌ను పోలి ఉండేలా ఒకటి రెండు అక్షరాలను మార్చి నకిలీ ప్రకటనలు తయారుచేసి వాటిని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆ సోమ్మును తమ ఖాతాలోకి వేసుకోవాలని భావించారు. అయితే ఈ విషయం తెలియని కొందరు పీఎం కేర్స్ బదులుగా సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి విరాళాలు జమ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు.. పీఎం కేర్స్ పేరిట ఉన్న నకిలీ ఖాతాలను బ్లాక్ చేసే పనిలో పడ్డారు.
నిపుణల సూచనలు..
అయితే పీఎం కేర్స్‌కు గానీ, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి గానీ విరాళాలు ఇచ్చేటప్పుడు ఆ వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక వెబ్‌సైట్లలలో గానీ, అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో గానీ పొందుపరిచిన ఖాతాలకు మాత్రమే విరాళాలు పంపాలని సూచిస్తున్నారు. లేకపోతే మంచి కోసం మీరు చేస్తున్న ప్రయత్నం మోసగాళ్లకు వరంలా మారుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే నకిలీ మెసేజ్‌లను నమ్మవద్దని కోరుతున్నారు. ఒకవేళ ఎవరైనా సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్‌లను గుర్తిస్తే బాధ్యత గల పౌరులుగా వాటిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు.
పీఎం కేర్స్‌కు సంబంధించిన అధికారిక ఖాతా వివరాలు ఇవీ..