20న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం : మంత్రి తలసాని

-

ఎంతో విశిష్టత కలిగిన బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ వేడుకలను అంగరంగ వైభవం నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఈ నెల 20న జరుగనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని పురస్కరించుకుని, వచ్చే భక్తులకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆలయ ఆవరణలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం అమ్మవారి దర్శనానికి 8 లక్షల మంది భక్తులు వచ్చారని, ఈ సారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నదన్నారు. ఇందుకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై స్థానికులు, భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ… అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని భక్తుల కోసం ప్రత్యక్ష ప్రసారం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, అలాగే కల్యాణ వేదిక ప్రాంగణంలో భక్తులు వీక్షించేలా 5 ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

ఈ నెల 19 నుంచి మూడు రోజుల పాటు జరిగే అమ్మవారి కల్యాణమహోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌ను అందుబాటులో ఉంచడం, శానిటేషన్‌ సమస్యలు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్‌ సరళతో పాటు పశ్చిమ మండలం డీపీసీ జోయల్‌ డేవిస్‌, ట్రాఫిక్‌ డీసీపీ హెగ్డే, డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటి, జలమండలి డైరెక్టర్‌ కృష్ణ, సీజీఎం ఎం.ప్రభు, ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌, డిప్యూటీ కమిషనర్‌ మోహన్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ హఫీజ్‌, ట్రాన్స్‌కో డీఈ సుధీర్‌, ఏడీఈ కిశోర్‌, పలు శాఖల అధికారులు, కార్పొరేటర్‌ లక్ష్మిరెడ్డి, మాజీ కార్పొరేటర్‌ ఎన్‌.శేషుకుమారి, దేవాలయ చైర్మన్‌ సాయిగౌడ్‌, ఈవో ఎస్‌.అన్నపూర్ణతో పాటు ఆలయ పాలక మండలి సభ్యులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version