సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా మార్కెట్ డివిజన్ రెజిమెంటల్ బజార్, ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కావాడిగూడ డివిజన్ తాళ్ల బస్తీ లో శుక్రవారం వార్డు కార్యాలయాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వార్డు కార్యాలయాలను ప్రారంభించామని తెలిపారు. వార్డు కార్యాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నగర ప్రజలకు మరింత వేగంగా పౌర సేవలను అందించడంతో పాటు సమస్యలను వేగంగా పరిష్కరించాలనే ఆలోచనతోనే వార్డు ఆఫీసులను ఏర్పాటు చేశామని అన్నారు. వార్డు ఆఫీసు వ్యవస్థతో జీహెచ్‌ఎంసీ , ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్, టౌన్ ప్లానింగ్, హార్టికల్చర్, ఎంట మాలజీ తదితర 11 విభాగాలకు చెందిన అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు.
వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. అంతేకాకుండా ఆయా శాఖల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని చెప్పారు. వార్డు స్థాయిలో కార్పొరేటర్లు ఉన్నా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా లేకపోవడం వల్ల ఈ వార్డు కార్యాలయ వ్యవస్థను తీసుకువచ్చామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్ లలో 150 వార్డు ఆఫీసులను ప్రారంభించాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు. మొదటగా 132 ఆఫీసులను తొలిదశలో ప్రారంభించుకుంటున్నామని వివరించారు. మిగిలిన ఆఫీసులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. వార్డు కార్యాలయానికి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి ఇన్‌చార్జిగాఉంటారని అన్నారు.