ఆగస్టు 5వ తేదీన కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసారా , మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమాలు రెండూ కూడా విడుదల అయ్యి థియేటర్లకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చాయి. ఇక ఈ రెండు సినిమాలపై అటు సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు.. సినీ సెలబ్రిటీలు.. క్రిటిక్స్ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉండడం గమనార్హం. ఇక మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని నేటి యువతరం హీరో సాయిధరమ్ తేజ్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు సినిమాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ రెండు సినిమాలు హిట్ అయినందుకు చిత్ర బృందాలతో పాటు పరిశ్రమలలో పలువురు కూడా సంబరాలు చేసుకుంటూ ఉండడం గమనార్హం.
ఇప్పటికే ఈ రెండు సినిమాల విజయాలపై స్పందించిన పలువురు సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో ఇటువంటి మంచి సినిమాలు రాలేదు అంటూ కొనియాడారు. ఇక ఈ క్రమంలోని తాజాగా ప్రముఖ నిర్మాత భరద్వాజ తమ్మారెడ్డి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇల్లు అలకగానే పండగ కాదు అంటూ వ్యాఖ్యానించిన ఆయన బింబిసారా, సీతారామం హిట్ అయిన మూడు, నాలుగు రోజుల కలెక్షన్లు చూసి సంబరాలు చేసుకోవడం సరైనది కాదు అంటూ వ్యాఖ్యానించారు. ఇక ఈ రెండు సినిమాల విజయాలపై కూడా ఆయన రివ్యూ ఇవ్వడం జరిగింది.
సీతారామం ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం అని ఆయన తెలిపారు. ఫస్ట్ ఆఫ్ లో కాశ్మీర్ పండితుల సమస్యను నిజాయితీగా చూపించారు. అలాగే హిందూ, ముస్లిం వంటి అంశాలను తీసుకొని అద్భుతమైన ప్రేమ చిత్రంగా మలిచారు డైరెక్టర్.ఇలాంటి సున్నితమైన ఎన్నో అంశాలను తీసుకొని మంచి సినిమాగా తీర్చిదిద్దిన డైరెక్టర్ ను తప్పనిసరిగా అభినందించాల్సిందే అంటూ తెలిపారు. బింబిసార గురించి మాట్లాడుతూ రెగ్యులర్ కమర్షియల్ కథే అని కథలో కొత్తదనం ఏమీ లేకపోయినా డైరెక్టర్ వశిష్ట సినిమా ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు అని ప్రశంసలు కురిపించారు. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆదరిస్తారని కానీ నాలుగు రోజుల కలెక్షన్లు చూసి సంబరాలు చేసుకోకుండా సినిమా రన్ టైం పెంచాలి అని ఆయన తెలిపారు. అంతేకాదు థియేటర్లలో రెగ్యులర్ ఆడియన్స్ పెరిగేలా సినిమాలను తీసుకురావాలని కూడా దర్శకులకు సూచించారు.