ఏపీ సీఎం జగన్ కేబినెట్‌లో సైలెంట్ మంత్రిగా పేరు తెచ్చుకున్న మహిళా మంత్రి తానేటి వనిత ఇప్పుడు రాజకీయంగా హైలెట్ అవుతున్నారు. ఆమెకు ఈ ఏడాది లక్కు బాగా కలిసొచ్చింది. ఈ యేడాది
ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో గెలిచిన అనితకు వెంటనే అన్ని కోణాల్లోనూ ఆలోచించిన జగన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారనే పేరు కోసం ఆమెకు మంత్రి పదవిని అప్పగించారు. ఎస్సీ + లేడీ కోటాలో ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖను ఆమె చేతిలో పెట్టారు. అయితే, ఆరు మాసాలు గడిచినా ఏ నాడూ ఆమె మీడియా ముందుకు రాలేదు. సంచలన ప్రకటనలు చేయలేదు.
దీంతో వనితపై సైలెంట్ నాయకురాలు. అసలు ఆమె ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు.. అనే ప్రచారం ఊపందకుంది. కానీ, ఈ విమర్శలకు, ప్రచారానికి ధీటుగా ఆమె తన పనిని సైలెంట్‌గా చేసుకుపోతున్నార ని నియోజకవర్గంలో ప్రజలు చెప్పుకొంటుండడం ఇప్పుడు సంచలనంగా మారింది. మంత్రిగా ఉంటూనే ఆమె స్థానికంగా పార్టీని బలోపేతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడా పైసా అవినీతి లేకుండా నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. అదే సమ యంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్తగా పాఠశాలల ఏర్పాటు, అంగన్ వాడీలపై దృష్టి పెట్టా రు.
అంతేకాదు, బలమైన టీడీపీ కంచుకోట వంటి కొవ్వూరులో ఆ పార్టీని బలహీనం చేసేలా పార్టీ మార్పులకు ప్రోత్సహిస్తున్నారు. కింది స్థాయి కేడర్‌లో సమరోత్సాహం నింపుతున్నారు. పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామని, వారికి మంచి గుర్తింపు ఇస్తామని రెండు రోజుల కిందట ఆమె పార్టీ కార్యాలయం నుంచే సందేశం ఒకటి లీక్‌చేశారు. దీంతో టీడీపీ నుంచి దాదాపు వంద మంది వరకు పార్టీ మారి వైసీపీ కండువా కప్పుకొనేందుకు రెడీ అయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే సమయంలో ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలను ప్రతి ఒక్క అర్హులకు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆమె ఇప్పటి నుంచే దూకుడు ప్రదర్శిస్తూ..సైలెంట్‌గా తన పనితాను చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.