మునుగోడు ఉపఎన్నికల పోరులో టీఆర్ఎస్-బీజేపీల మధ్యే ప్రధాన ఫైట్ నడుస్తున్నట్లు రాజకీయం జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి పెద్దగా చర్చకు రావడం లేదు. మీడియాలో కూడా ఈ రెండు పార్టీల మధ్య వార్‌ని ఎక్కువ హైలైట్ చేస్తున్నాయి. దీని వల్ల మునుగోడులో బలంగా ఉన్న కాంగ్రెస్ కనబడటం లేదు. కానీ వాస్తవ పరిస్తితులు వేరుగా ఉన్నాయి. కోమటిరెడ్డి బీజేపీ వైపుకు వెళ్ళినా సరే..మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కొంతవరకు బలంగానే ఉంది.
పూర్తి స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ వైపుకు వెళ్లలేదు. అలాగే కింది స్థాయి ప్రజా ప్రతినిధులని సైతం అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీలు లాగేస్తున్నాయి. అయినా సరే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ తగ్గలేదు. ఇప్పుడు మునుగోడులో టీఆర్ఎస్ గెలవాలన్న, బీజేపీ గెలవాలన్న కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మెయిన్. అనేక ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్న వారిని…తమవైపుకు తిప్పుకోవాలని రెండు పార్టీలు ట్రై చేస్తున్నాయి.
ఇప్పటికే కమ్యూనిస్టుల మద్ధతుని తీసుకుని టీఆర్ఎస్ ఓ అడుగు ముందుంది..అలాగే బలమైన కాంగ్రెస్ ఓటు బ్యాంకుని కూడా తిప్పుకుని మునుగోడులో గెలిచి తీరాలని చూస్తుంది. అటు బీజేపీ కూడా అదే పనిలో ఉంది. అయితే తన వెంట పూర్తిగా రాని కాంగ్రెస్ శ్రేణులని ఇంకా తన వైపుకు తీసుకురావడానికి కోమటిరెడ్డి గట్టిగానే ట్రై చేస్తున్నారు. కానీ తెలివిగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి…కాంగ్రెస్ శ్రేణులని మార్చుకోవాలని చూస్తున్నారు.
రేవంత్‌పై తీవ్ర విమర్శలు చేస్తూనే..ఆయన వల్లే కాంగ్రెస్ నాశనమవుతుందని, చంద్రబాబు డైరక్షన్‌లో పనిచేసే రేవంత్ రెడ్డిని నమ్మోద్దు అనే విధంగానే కోమటిరెడ్డి మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ శ్రేణులని…రేవంత్‌ని నమ్మవద్దని చెబుతున్నారు. దీని ద్వారా రేవంత్‌పై కోపంతో కాంగ్రెస్ శ్రేణులు పూర్తి స్థాయిలో తనవైపు తిరుగుతారని అప్పుడు ఈజీగా గెలవచ్చనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. అంత తేలికగా కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ వైపు వెళ్ళే అవకాశాలు కనిపించడం లేదు.