క్రికెట్ లో ఒక్కోసారి అద్భుతాలు జరుగుతాయి. అవి ప్రపంచంలో ఏమూల జరిగినా చూసేవారికి వింతగానే ఉంటాయి. ఒక్క ఓవర్‌లో ఆరు సిక్సులు.. అతి తక్కువ స్కోరు చేసి గెలవడం.. ఇలాంటివి. తాజాగా అలాంటిదే మరో విచిత్రం జరిగింది.
ఓ జట్టు సెకండ్ బ్యాటింగ్ చేస్తోంది. గెలవాలంటే.. కేవలం 14 పరుగులు మాత్రమే చేయాలి.. చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉన్నాయి. ఇంకా 11 ఓవర్లు ఆడే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఆ జట్టు ఓడిపోతుందని ఎవరైనా అనుకుంటారా.. కానీ అదే జరిగింది.
ఇంతకీ అసలేం జరిగింది.. ఆస్ట్రేలియా వన్డే కప్ సిరీస్ జరుగుతోంది. విక్టోరియా, టజ్మేనియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఫస్ట్ బ్యాటింగ్ విక్టోరియా టీమ్ చేసింది. 50 ఓవర్లలో 185 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన టజ్మేనియా 39 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. విక్టోరియా టీమ్ గెలుపుపై ఆశలు వదిలేసుకుంది.
అంతా టజ్మేనియా గెలుస్తుందనే అనుకున్నారు. కానీ.. విక్టోరియా బౌలర్లు అద్భుతం చేశారు. చివరి 11 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఆరు వికెట్లు తీసేశారు. మొత్తానికి 184 పరుగులకే ఆలౌట్ చేశారు. విక్టోరియా జట్టు ఒక్క పరుగు తేడాతో గెలిచింది. క్రికెట్ లో అప్పుడప్పడు జరిగే ఇలాంటి అద్భుతాలు భలే మజా ఇస్తాయి.