ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది..ఇంతకాలం టిడిపి-జనసేన పొత్తుపై పెద్ద ఎత్తున చర్చ నడిచిన విషయం తెలిసిందే. అయితే ఊహించని విధంగా టిడిపి-కమ్యూనిస్టులు దోస్తీ దిశగా వెళుతున్నారు. ఎప్పుడో 2009లో టిడిపి-కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక 2019 ఎన్నికల్లో ఏపీలో టిడిపి ఓడిపోయి అధికారం కోల్పోయాక ప్రతిపక్షంగా ఉంటూ అధికార వైసీపీపై పోరాడుతుంది.
ఈ క్రమంలో సిపిఐ..టిడిపికి మద్ధతుగా నిలుస్తూ వస్తుంది. అప్పుడప్పుడు ఉమ్మడి పోరాటాలు కూడా చేశారు. అలాగే విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో కొన్ని డివిజన్లలో కమ్యూనిస్టులకు టిడిపి మద్ధతు కూడా ఇచ్చింది. అయితే బిజేపి-జనసేనతో టిడిపి కలిసి ముందుకెళుతుందనే ప్రచారం నేపథ్యంలో కమ్యూనిస్టులు కాస్త టిడిపికి దూరంగా ఉంటున్నారు. కానీ బిజేపి..టిడిపితో కలిసేది లేదని అంటుంది. దీంతో టిడిపి సైతం బిజేపితో పొత్తుకు సిద్ధంగా కనిపించడం లేదు. ఈ క్రమంలో కమ్యూనిస్టులు..టిడిపికి దగ్గరవుతున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరస్పరం సహకరించుకోవడానికి సిద్ధమయ్యారు. పట్టభద్రుల స్థానాల్లో ఒకరికొకరు సహకరించుకోవాలని డిసైడ్ అయ్యారు.
మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో టిడిపి పోటీ చేస్తుంది..అటు కమ్యూనిస్టుల ఉభయంగా పిడిఎఫ్ ద్వారా పోటీ చేస్తున్నారు. అయితే పట్టభద్ర స్థానాల్లో వామపక్షాలు మొదటి ప్రాధాన్య ఓటును తమ వారికి వేసుకుని రెండో ప్రాధాన్య ఓటును టీడీపీకి వేస్తాయి. అలాగే టీడీపీ కూడా మొదటి ప్రాధాన్య ఓటును తమ వారికి వేసుకుని రెండో ప్రాధాన్య ఓటును వామపక్షాల అభ్యర్థులకు వేస్తుంది.
ఇక రెండు ఉపాధ్యాయ స్థానాల్లో టిడిపి పోటీ చేయడం లేదు. దీంతో ఆ స్థానాల్లో తమకు మద్ధతు ఇవ్వాలని పిడిఎఫ్ కోరుతుంది. అదే సమయంలో ఏపీటీఎఫ్ కూడా ఉపాధ్యాయ స్థానాల్లో తమకు మద్ధతు ఇవ్వాలని టిడిపిని కోరుతుంది. దీంతో టిడిపి ఎవరికి మద్ధతు ఇస్తుందనేది చూడాలి. అయితే కమ్యూనిస్టులతో టిడిపి ఇలాగే పొత్తు కొనసాగిస్తుందా? వీరితో పవన్ కలుస్తారా? అనేది చూడాలి.