వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పోటా పోటీగా పేకాట క్లబ్ లు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని జూదాంద్రప్రదేశ్ గా మారుస్తున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఉండవల్లి శ్రీదేవి పేకాట క్లబ్ లో భాగోతం ఆధారాలతో బయటకు వచ్చిందని, వైసీపీ నాయకులు చేత పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్న ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యే పదవికి అనర్హురాలని అన్నారు. మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న శ్రీదేవి ఆడియో క్లిప్పింగ్స్ పై ప్రభుత్వ విచారణకు ఆదేశించాలని ఆమె డిమాండ్ చేశారు.
వాటాల పంపిణీలో తేడాలు రావడంతో ప్రాణ హాని ఉందంటూ కొత్త నాటకానికి శ్రీదేవి శ్రీకారం చుట్టారన్న అనిత మహిళా లోకానికి శ్రీదేవి మాయని మచ్చగా మారారని అన్నారు. ఎంతో గౌరవ ప్రదమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి పేకాట క్లబ్ లు నిర్వహించడం వైసీపీ నేతల దిగజారుడు తనానికి నిదర్శనమని అనిత విమర్శించారు. ఊరూరా పేకాట క్లబ్ లు ఏర్పాటు చేసి ప్రజలను గుల్ల చేస్తున్నారని, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోకుండా పేకాట క్లబ్ ల పై దృష్టి పెడుతున్నారని అనిత విమర్శించారు.