వైకాపా ఎమ్మెల్యేల “సంస్కారానికి నమస్కారం” అంటున్న తమ్ముళ్లు!

-

ప్రస్తుతం వైకాపా ఎమ్మెల్యేలు తమ ప్రవర్తనతో టీడీపీ కార్యకర్తల మనసు దోచుకుంటున్నారనే చెప్పాలి. ఇదే క్రమంలో నందమూరి అభిమానుల మనసు కూడా దోచుకుంటున్నారు. దానికి కారణం… నెల్లూరు జిల్లా కావలిలోని ఎన్టీఆర్ విగ్రహం! అదేమిటి… కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగించారని తమ్ముళ్లంతా ప్రభుత్వంపై ఫైరవుతుంటే… ఇలా అంటారేంటి అంటారా… అక్కడే ఉంది అసలు విషయం!

నెల్లూరు జిల్లా కావలిలోని ఎన్టీఆర్ విగ్రహం తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో… టీడీపీలో చంద్రబాబు నుంచి కింది స్థాయి కార్యకర్త వరకూ అంతా ఫైరవుతున్నారు. దీంతో బాలయ్య నెల్లురూ జిల్లా టీడీపీ నేతలు ఫోన్ చేసి… అస్సలు తగ్గొద్దొద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ విగ్రహం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించగా… చంద్రబాబు ఫోన్ చేసి “ఛలో కావలి” ప్రోగ్రాం పెట్టండని తమ్ముళ్లను రెచ్చగొడుతున్నారు. ఈ సమయంలో వైకాపా స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.. బాలయ్యకు ఫోన్ చేశారు!

కావలిలోని ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం వీపు భాగం ఆలయం ఎదురుగా ఉన్నందునే స్థానికులు తొలగించారని మొదలుపెట్టిన ప్రతాప్ కుమార్ రెడ్డి… వివాదాస్పదం కాని స్థలంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కచ్చితంగా ఏర్పాటు చేస్తామని బాలయ్యకు హామీ ఇచ్చారు. ఇదే సమయంలో తానుకూడా ఎన్టీఆర్ వీరాభిమానిని అని రామిరెడ్డి, బాలయ్యకు తెలిపారు. ఈ విషయాలపై బాలయ్యకూడా సానుకూలంగా స్పందించారంట!

ఆ సంగతులు అలా ఉంటే… ఒక పార్టీకి చెందిన నాయకుడు, మహానేత, మాజీ ముఖ్యమంత్రి అయిన వ్యక్తి విగ్రహాన్ని ప్రస్థితుల ప్రభావం వల్ల తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు… అనంతరం ఆ విగ్రహాన్ని మరో చోట ప్రభుత్వమే మరింత ఘనంగా పునఃప్రతిష్టించాలి. అది ఆయా ప్రభుత్వాల కనీస ధర్మమే కాకుండా.. ఆ పార్టీ నాయకుల సంస్కారం కూడా! ఈ విషయంలో ఎన్ టీఆర్ విగ్రహాన్ని మరొక స్థలంలో మరింత ఘనంగా ఏర్పాటుచేస్తానన్న వైకాపా ఎమ్మెల్యేలు సంస్కారం విషయంలో మార్కులు కొట్టేశారు!

ఆ వ్యవహారం అలా ఉంటే… గతంలో వైఎస్సార్ విగ్రహాన్ని విజయవాడలో తొలగించినప్పుడు.. నాటి టీడీపీ ప్రభుత్వ నేతలు కానీ, ముఖ్యమంత్రి కానీ.. స్థానిక ఎమ్మెల్యేలు కానీ.. ఆ విగ్రహం విషయంలో నాడు పోరాటాలు ధర్నాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలకు కానీ.. వైకాపా నేతలకు కానీ వివరణ ఇచ్చిందీ లేదు.. సంస్కారవంతంగా నడుచుకున్నదీ లేదనే కామెంట్లు ఇప్పుడు మొదలైపోయాయి! దీంతో… వైకాపా నాయకుల సంస్కారానికి నమస్కారం అంటూ సోషల్ మీడియలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు! ఆ నెటిజన్లలో టీడీపీ కార్యకర్తలు కూడా ఉండటం కొసమెరుపు!

Read more RELATED
Recommended to you

Exit mobile version