ఫ‌స్ట్ టార్గెట్ కేసీఆర్‌… నెక్ట్స్ జ‌గ‌నే

-

ఇప్పటికే నార్త్ ఇండియా పై తిరుగులేని గ్రిప్ సాధించిన బిజెపి అటు ఈశాన్య రాష్ట్రాలను కూడా దాదాపు క్లీన్‌స్వీప్ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిజెపి దృష్టంతా నార్త్ ఇండియా మీదే ఉంది. బిజెపికి ముందు నుంచి నార్త్ ఇండియా రాష్ట్రాలు ఏమాత్రం కొరుకుడు పడటం లేదు. ఎట్టకేలకు కర్ణాటకలో జెడిఎస్ – కాంగ్రెస్ సంకీర్ణ కూటమిని గ‌ద్దె దించి బిజెపి అధికారంలోకి రాగలిగింది. ఇక ఇప్పుడు ఆ పార్టీ దృష్టంతా ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల మీద ఉంది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న‌ని బిజెపి వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది..


తెలంగాణ‌లో నాలుగేళ్లకు ఎన్నికలు ఉంటే బిజెపి మాత్రం ఇప్పుడే ఎన్నిక‌లు ఉన్నాయ‌న్న‌ట్టు క్షేత్రస్థాయిలో పని చేస్తుండటం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపి పాగా వేయాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని.. ఈ క్రమంలోనే కేసీఆర్‌ను ముందుగా టార్గెట్ చేస్తోందని… ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను సాగనంపేందుకు ప్రణాళికలు వేస్తోందని అన్నారు.

శుక్రవారం తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన టిడిపి అధినేత చంద్రబాబును సైతం విమర్శించారు. చంద్రబాబుకు అన్నీ తెలుసు కానీ… ఆయన మాత్రం ఏమీ తెలియని వాడిలా ఉంటారని విమర్శించారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి చంద్రబాబే కారణమని… ఆయ‌న తీసుకునే నిర్ణ‌యాల్లో చాలా జాప్యం ఉంటుంద‌ని.. అందుకే టీడీపీ ఓడిపోయింద‌న్నారు.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేలు చేసిన అవినీతి వ‌ల్లే ఎంపీలు కూడా ఓడిపోయార‌ని ఆయ‌న చెప్పారు. అదే టైంలో ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పాల‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించి మ‌రో సంచ‌ల‌నానికి తెర‌దీశారు. జగన్ ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు చాలా బాగున్నాయి అంటూ కితాబిచ్చారు. ఏదేమైనా కొద్ది రోజులుగా రాయ‌పాటి పార్టీ మార‌తారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న బీజేపీపై విమ‌ర్శ‌లు చేయ‌డంతో పాటు సొంతపార్టీ అధినేతపై కన్నెర్ర జేయడం… జ‌గ‌న్‌ను ప్ర‌శంసించ‌డంతో ఆయ‌న వైసీపీలోకి వెళ‌తారన్న టాక్ వ‌స్తోంది. మ‌రి రాయ‌పాటి మ‌దిలో ఏముందో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version