టీడీపీ అధినేత నారా చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆ పార్టీ నేతలు
భావిస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత అరెస్టై, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. కేసులో తన రిమాండ్ చెల్లదని చెబుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే చంద్రబాబు అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
చంద్రబాబు కేసులో న్యాయపోరాటం నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరికొన్నిరోజులు ఢిల్లీలోనే ఉండనున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదులతో వరుసగా సమీక్షలు జరుపుతున్నారు. సుప్రీంకోర్టులో వేయాల్సిన పిటిషన్లపై న్యాయవాదులతో చర్చిస్తున్నారు. ఇదే సమయంలో క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. స్కిల్ స్కాం కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి కొన్ని అంశాలను ప్రస్తావించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 140 మంది సాక్షులను విచారించారని, 4 వేల కాపీలను అందజేశారని వెల్లడించారు. ఈ సమయంలో పోలీసుల విచారణలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు.