నిబద్ధత.. బద్ధత.. నిమ్మకాయ్.. అంటూ.. కబుర్లు చెప్పే.. తెలుగు మీడియాలో ఆశ్చర్యకర సంఘటన వెలుగు చూసింది. ముఖ్యంగా చంద్రబాబు అనుకూల మీడియాలో ఓ విషయంపై తర్జన భర్జన సాగుతోంది. బాబుకు అనుకూలంగా ఉండే వార్తలను ప్రచురించడం.. జగన్‌కు వ్యతిరేకంగా ఉండే వార్తలను ప్రసారం చేయడం అనేది ఎప్పటి నుంచో ఉన్న విషయం తెలిసిందే. అదేసమయంలో కొన్ని వార్తలను ప్రజల కోసంకూడా ప్రచురిస్తూ.. ప్రసారం చేస్తూ ఉంటారు. కానీ, ఇప్పుడు పూర్తిగా ట్రెండ్ మారిపోయింది. తమకు అనుకూలంగా ఉన్నవేప్రచురించాలని, దీనిలో ప్రజాకోణంతో తమకు పనిలేదన్నట్టుగా వ్యవహరిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
రానురాను టీడీపీ పరిస్థితి దారుణంగా తయారయ్యే సరికి.. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వార్తలను.. ప్రచురించరాదని, ప్రసారం చేయరాదని కూడా ఈ మీడియా నిర్ణయించినట్టు మీడియా వర్గాల్లో చర్చ సాగుతోంది. ఒకప్పుడు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే.. వారు వచ్చేముందు.. వారు వచ్చిన తర్వాత వార్తలు ఇచ్చిన ఈ మీడియా.. తర్వాత కాలంలో వారితో ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చిమరీ.. జగన్‌పై దుమ్మెత్తి పోయించింది. అయితే, ఇప్పుడు మాత్రం టీడీపీ నుంచి వైసీపీలోకి చేరుతున్న ఎమ్మెల్యేలు, నేతల విషయంలో నిన్న మొన్నటి వరకు ఓ మాదిరి వార్తగా అయినా కవర్ చేసినప్పటికీ.. ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టాలని నిర్ణయించింది.
తాజాగా విశాఖజిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.. జగన్ సమక్షంలో వైసీపీ గూటికి చేరిపోయారు. ఇది నిజానికి రాజకీయంగా సంచలనం సృష్టించే వార్త. అయితే, బాబు అనుకూల మీడియా ఈ వార్తను పూర్తిగా కట్ చేసేసింది. అసలు తమకు తెలియదన్నట్టు వ్యవహరించింది. ఈ వార్తతాలూకు వాసన కూడా తమ ద్వారా బయటకు పోరాదని నిర్ణయించింది. ఈ పరిణామం.. పాత్రికేయ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ముగ్గురుపార్టీ మారిపోయారు. ఇప్పుడు నాలుగో వికెట్ పడిపోయింది.
ఈ పరిణామాలతో టీడీపీలో అంతర్మథనం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీని భ్రష్టుపట్టించడం ఎందుకని భావించిందో ఏమో బాబు అనుకూల మీడియా.. ఈ వార్తలను పూర్తిగా ఎడిట్ చేసేసింది. మరి ఇదేం నిబద్ధతో సదరు మీడియా అధినేతకే తెలియాలని అంటున్నారు మీడియా వర్గాలకు చెందిన మేధావులు. ఉన్నది ఉన్నట్టు రాస్తామని, దమ్ముందని చెప్పుకోవడం అంటే ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు.
-Vuyyuru Subhash