ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఏమో గాని.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. పార్టీలో ఉన్న కీలక నేతలు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారిపోవడం చంద్రబాబు ని బాగా ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. అలాగే కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన రామసుబ్బారెడ్డి కూడా పార్టీ మారారు. మరికొందరు నేతలు టిడిపిని వేయడానికి సిద్ధంగా ఉన్నారు.
ఎమ్మెల్సీ ప్రభాకర్ కూడా వైసీపీలో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. మాజీ మంత్రులు డొక్కా మాణిక్య వరప్రసాద్ అలాగే సిద్ధ రాఘవరావు మరికొందరు జగన్ బాటలో నడుస్తున్నారు. ఇప్పుడు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న రాయలసీమ జిల్లాల్లో భారీగా బీజేపీ లోకి చేరికలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే బిజెపిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అలాగే కడప జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు, చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు.
అదేవిధంగా ప్రకాశం జిల్లాకు చెందిన మరికొంతమంది నేతలు కూడా బీజేపీ లోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. తమ మీద ప్రభుత్వం ఒత్తిడి ఎక్కువగా ఉందని తాము పార్టీలో కొనసాగలేమని చంద్రబాబు వద్ద స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. త్వరలోనే వీరందరూ మంచి ముహూర్తం చూసుకుని బీజేపీ కండువా కప్పుకుంటే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే వీరిని చంద్రబాబు కావాలనే బీజేపీలోకి పంపిస్తున్నారు అనేవాళ్ళు కూడా ఉన్నారు.