తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు ఇంకా షెడ్యూల్ ప్రకటించలేదు. కానీ గతానికి భిన్నంగా ముందే అభ్యర్థిని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మినే .. ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఉప ఎన్నికల కసరత్తు దిశగా ఎలాంటి అడుగులు వేయడంలేదు. అభ్యర్దిగా కనీసం ప్రజల్లోకి వెళ్లిన హడావిడి ఎక్కడా కనిపించడం లేదు. పనబాక పోటిలో ఉంటారా లాస్ట్ మినిట్ చంద్రబాబుకి షాకిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
సాధారణంగా ఎన్నికలంటే అభ్యర్థుల ఎంపికపై బోల్డంత కసరత్తు చేస్తారు చంద్రబాబు. వడపోతలపై వడపోతలు ఉంటాయి. నాన్చుతారు. చివరి క్షణం వరకు టెన్షన్ పెడతారు. కానీ.. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక విషయంలో ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టేశారు టీడీపీ అధినేత. మిగతా పార్టీల కంటే ముందుగానే.. రెండు నెలల క్రితమే అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరు ప్రకటించారు. అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో టీడీపీ ప్రచారం ఊదరగొడుతుందని.. పనబాక నియోజకవర్గాలను చుట్టేస్తారని అనుకున్నారు. కానీ ఈ ప్రచారానికి భిన్నంగా పార్టీకి షాకిస్తున్నారు అభ్యర్ది పనబాక లక్ష్మి.
అసలు పనబాకకు ఎన్నికల్లో పోటి చేయాలని ఉందా లేదా అన్నది టీడీపీ కేడర్ లోనే గందరగోళం సృష్టిస్తుంది. పనబాక కు వైసీపీ నుంచి బరిలో దిగాలని ఆసక్తి ఉందట..గత ఎన్నికల సమయంలో వైసీపి నుంచి ఆఫర్ వచ్చినా ఆమె తిరస్కరించడంతో ఇప్పుడు ఆమెకు వైసీపీలో చాన్స్ లేదంటున్నాయి వైసీపీ వర్గాలు. ఒకవేళ టీడీపీ నుంచి రెండోసారి బరిలో దిగితే గెలుస్తామన్న ధైర్యం కూడా లేదని సమాచారం. రెండో స్థానం దక్కుతుందో లేదో కూడా డౌటేనట. అందుకే అభ్యర్దిగా ప్రకటించినా సైలెంట్ గా ఉన్నారట..
పనబాక టీడీపీలో చేరకముందు కాంగ్రెస్‌లో ఉన్నారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు మారిపోయాయి. బీజేపీ-జనసేన కలిసి గట్టిగానే తిరుపతిపై ఫోకస్ పెట్టాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. మరి.. ఈ రెండు బలమైన శక్తుల మధ్య పోరాటం అంటే శక్తి సరిపోదని భావించారో ఏమో సైలెంట్‌గా ఉండిపోయారు.