టీడీపీలో నాలుగుస్తంభాలాట‌.. ప‌ద‌వుల కోసం త‌మ్ముళ్ల కీచులాట…‌!

-

Vకీల‌క‌మైన న‌లుగురు నాయ‌కులు నాకంటే నాకేన‌ని పోటీ ప‌డుతున్నారు. వీరిలో ముఖ్య‌నాయ‌కుడు, టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎం.ఎస్ రాజు ఉండ‌డంతో పోటీ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారిపోయింది. విష‌యంలోకి వెళ్తే.. అనంతపురం పార్లమెంటు అధ్యక్ష పదవిని రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన పూల నాగరాజు ఆశిస్తు న్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన క్రియాశీలక కార్యకర్తగా ఉంటున్నారు. 2017లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా నియమించారు. 2019 ఎన్నికల నోటిఫికేషన్‌ వరకూ ఆయన ఆ పదవిలో కొనసాగారు.

అదేవిధంగా గుంతకల్లు నియోజకవర్గం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్ కూడా అనంత‌పురం పార్ల‌మెంటు స్థానం అధ్య‌క్ష‌ పదవిని ఆశిస్తున్నారు. 1999 నుంచి తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్నారు. జిల్లా కార్యనిర్వహక కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పార్టీ పదవుల్లో పనిచేశారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ…. ఆఖరి క్షణాల్లో ఆయన అభ్యర్థిత్వాన్ని కోల్పోతూ వచ్చారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు.  మ‌రో కీల‌క నాయ‌కుడు ఆదినారాయణ  పార్టీలో విద్యార్థి ద‌శ నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా న్యాయ వాది. ఆ పార్టీలో ఆయన అనేక పదవులు అలంకరించారు.

అనంతపురం మున్సిపాల్టీని కార్పొరేషన్‌గా మార్చిన తరువాత జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ఈ క్రమంలోనే కౌన్సిల్‌ ప్రతిపక్ష నాయకు డిగా పనిచేశారు. ఆ తరువాత అనంతపురం మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా కూడా పనిచేశారు. అనంతపురం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఐదు దఫాలుగా ఆ పదవిలో ఉన్నారు. ప్రస్తుతం అనంతపురం పార్లమెంటు పార్టీ అధ్యక్షుడి స్థానాన్ని ఆశిస్తున్నారు. వీరంద‌రికంటే మిన్న‌గా ప్ర‌చారంలో ఉన్నారు.. పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు.  జిల్లాలో ఎస్సీలను పరిగణనలోకి తీసుకుంటే తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఇప్పటికే ఆ పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన సన్నిహితవర్గాల ద్వారా తెలిసింది.

ఈ నేపథ్యంలో ఎంఎస్‌రాజు ఇప్పటికే అనంత పురం పార్లమెంటు పరిధిలోని పలువురు నేతలను కలిసి అధ్యక్ష స్థానం ఆశిస్తున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో వీరిలో ఎవ‌రికి ఈ పీఠం ద‌క్కుతుందోనని పార్టీలో తీవ్ర ఉత్కంఠ ఏర్ప‌డ‌డం గ‌మ‌నార్హం. మ‌రి బాబు ఎలా ప‌రిష్క‌రిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news