వైసీపీలో లుక‌ల‌క‌లు టీడీపీ క్యాష్ చేసుకుంటుందా…!

-

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో అధికార వైసీపీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. టీడీపీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ వైసీపీ వైపుకు వెళ్ళడం అసలు రచ్చ మొదలైంది. చంద్రబాబు అవకాశం ఇవ్వడంతో 2014 ఎన్నికల్లో వంశీ గన్నవరం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదేళ్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా బాగానే నడుచుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో గెలిచాక, టీడీపీ అధికారంలోకి రాకపోవడం, పైగా తనపై నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని కేసులు రావడంతో వంశీ వెంటనే జగన్‌ని కలిసేశారు. తర్వాత కొన్ని రోజులు రాజకీయాలకు దూరమవుతానని లేనిపోని ప్రకటనలు చేశారు.


అయితే అలా రాజకీయాలకు దూరమవుతానని చెప్పే, సడన్‌గా బాబుపై తీవ్ర విమర్శలు చేసి జగన్‌కు మద్ధతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఇక అప్పటి నుంచి బాబుని తిట్టడం, జగన్‌ని పొగడటమే పనిగా పెట్టుకుని వంశీ ముందుకెళుతున్నారు. ఇదే సమయంలో వంశీ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం కూడా మొదలైంది. ఇక ఇక్కడే అసలు ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఉపఎన్నికలు వస్తే తనకే టిక్కెట్ ఇవ్వాలని గన్నవరం వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు, జగన్‌ని కోరుతున్నారు.

పైగా వంశీపై పరోక్షంగా విమర్శలు చేస్తూ, అసలైన వైసీపీ కార్యకర్తలకు న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకే టిక్కెట్ ఇవ్వాలని, ఒకవేళ ఇవ్వకపోతే వంశీకి సహకరించే ప్రసక్తి లేదని చెబుతున్నారు. అయితే వైసీపీలో పరిస్థితి ఇలా ఉంటే టీడీపీలో మాత్రం ఎలాంటి సందడి లేదు. వంశీ వెళ్లిపోయాక గన్నవరంలో ఇన్‌ఛార్జ్‌ని పెట్టలేదు. పలువురు పేర్లు తెరపైకి వచ్చినా కూడా చంద్రబాబు గన్నవరానికి కొత్త నాయకుడుని తీసుకురాలేదు.

ఇక వైసీపీలో అంతర్గత విభేదాలు నెలకొన్న సమయంలో, టీడీపీకి కొత్త నాయకుడుని తీసుకొస్తే పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని కార్యకర్తలు భావిస్తున్నారు. స‌మ‌ర్థుడు అయిన‌ నాయకుడుని గన్నవరం బరిలో దింపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్క‌డ కొత్త నేత‌ను ఎంత త్వరగా దింపితే అంత త్వరగా వంశీకి చెక్ పెట్టగలమని అంటున్నారు. మరి చూడాలి తమ్ముళ్ళ డిమాండ్‌ని బాబు  పట్టించుకుంటారో లేదో.. ?

Read more RELATED
Recommended to you

Exit mobile version