రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఏంటి? బలంగానే ఉందా? లేక బలంగానే ఉందని భావిస్తున్నారా? ఏం జరుగుతోంది? తాజాగా టీడీపీ అనుకూల మీడియా రాసిన కథనాన్ని బట్టి.. టీడీపీ చాలా బలంగా ఉందని, దీనిని బలహీన పరిచేందుకు రాష్ట్రంలో రెండు పార్టీలు పనిగట్టుకుని ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది. అదే నిజమైతే.. బలమైన పార్టీకి అంతకంటే బలమైన నాయకుడిగా ఫార్టీ ఇయ ర్స్ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఎందుకు అడ్డుకోలేక పోతున్నారు? అనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. పోనీ.. బలంగానే ఉందని అనుకుంటే.. ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయి ఉండాలి? నేతలు ఎందుకు జారుకుంటున్నారు? అనే ప్రశ్నలకైనా సమాధా నం లభించి ఉండాలి.
కానీ, ఈ ప్రశ్నలకు సమాధానం లభించకపోగా.. పార్టీ గ్రాఫ్ మరింతగా పడిపోతోందనేది జగమెరిగిన సత్యం. ఒక పార్టీని బలహీన పరచాలని ఎవరైనా ప్రయత్నిస్తే.. బలహీన పడుతుందా? ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రత్యక్ష ఉదాహరణ రాష్ట్రంలో అధికారం లోకి వచ్చిన వైసీపీనే! ఎన్నికలకు ముందు.. రాష్ట్రంలో వైసీపీ నిజంగానే బలహీన పరిచే కుట్ర సాగింది. పార్టీని, పార్టీ అధినేత జగన్‌ను కూడా చులకన చేసేలా అనేక రాజకీయ శక్తులు సహా ఓ వర్గం మీడియా తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలోనే 23 మంది ఎమ్మెల్యేలను ముగ్గురు ఎంపీలను కూడా ఆ పార్టీ నుంచి బయటకు తీసుకువచ్చారు.
ఇక, జగన్ నేరస్తుడని, అలాంటి వారు రాష్ట్రానికి సీఎం అయితే శాపమని, ఆయనకు ఏం అనుభవం ఉంది కనుక సీఎం సీటులో కూర్చోబెట్టాలని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇంతకన్నా బలహీన పరిచే కుట్రలు ఏముంటాయి? అయినప్పటికీ.. జగన్, ఆయన పార్టీ సత్తాలేంటో గత ఏడాది ఎన్నికల్లో తెలి సిపోయాయి. ఇక, ఇప్పుడు టీడీపీ విషయానికి వస్తే.. ఈ పార్టీని ఎవరో పనిగట్టుకుని బలహీన పరుస్తున్నారని, అయినప్పటికీ.. చంద్రబాబు, ఆయన పార్టీ కూడా బలంగానే ఉన్నాయి… కాబట్టి.. ఎవరైతే.. బలహీన పరచాలని ప్రయత్నాలు చేస్తున్నారో.. వారి ఆశలు తీరడం లేదని వాదిస్తున్నారు.
నిజానికిటీడీపీని ఎవరూ బలహీన పరిచే ప్రయత్నం చేయడం లేదన్నది వాస్తవం. ఉన్న నేతలు కూడా తమ తమ వ్యాపారాల కోసం, తమ తమ ప్రాధాన్యాల కోసం ఎవరికి నచ్చిన మార్గంలో వారు ప్రయత్నిస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వారు ఉంటున్నారు. అసలు అధినేతను కూడా లెక్కచేయని నాయకులు కనిపిస్తున్నారు. కాబట్టి.. పైకి చెప్పుకొంటున్నట్టు, చేస్తున్న ప్రచారం మేరకు పార్టీ బలంగా ఉందని అనుకుంటే.. పొరపాటే! అనేది విశ్లేషకుల మాట!!