దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాన్పూర్ కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు వికాస్ దూబేను ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఎట్టకేలకు ఎన్‌కౌంటర్ చేశారు. జూలై 2వ తేదీన కాన్పూర్ సమీపంలోని అతని ఇంటిపై పోలీసులు దాడి చేయగా.. అందులో గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే, అతని అనుచరులు పోలీసులపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఆ ఘటనలో మొత్తం 8 మంది పోలీసులు ప్రాణాలను కోల్పోయారు. తరువాత వికాస్ దూబే తప్పించుకుని పారిపోగా.. అతన్ని మధ్యప్రదేశ్‌లో ఉజ్జయని మహంకాళి ఆలయం వద్ద గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తరువాత అతన్ని కాన్పూర్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో తప్పించుకునేందుకు యత్నించడంతో అతన్ని యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.
అయితే కాన్పూర్‌లో పోలీసులు దాడి చేస్తారన్న సమాచారాన్ని వికాస్ దూబే ముందే తెలుసుకున్నాడు. అతనికి అక్కడి బిక్రూ పోలీస్ స్టేషన్ పోలీసులు ముందుగా సమాచారం ఇచ్చారని స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో వికాస్‌దూబేకు సమాచారం ఇచ్చారని భావిస్తున్న పలువురు పోలీసు అధికారులు, సిబ్బందిని ఇప్పటికే ఎస్‌టీఎఫ్ అదులోకి తీసుకుని విచారిస్తోంది. కాగా ఆ పోలీసుల్లో ఒకడైన కె.శర్మ అనబడే ఎస్సై తననూ ఎస్‌టీఫ్ వారు ఎన్‌కౌంటర్‌లో చంపేస్తారని భయంగా ఉందని.. తాను వికాస్ దూబేకు ఆ దాడి గురించి సమాచారం ఇచ్చానన్న నెపంతో తనను, తన కుటుంబ సభ్యులను ఎన్‌కౌంటర్‌లో చంపేస్తారేమోనని భయంగా ఉందని చెబుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరాడు.
ఎస్సై కె.శర్మ బిక్రూ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. జూలై 2వ తేదీన రాత్రి పోలీసులు వికాస్ దూబే ఇంటిపై దాడి చేసేందుకు వెళ్తున్నారని.. వికాస్‌దూబేకు ఎస్సై శర్మ అదే సమాచారం చేరవేశాడని ఎస్‌టీఎఫ్ అధికారులు విచారణలో తేల్చారు. అలాగే వికాస్ దూబేతో సంబంధాలు ఉన్నట్లుగా చెప్పబడుతున్న పలువురు పోలీసు అధికారులు, సిబ్బందిని కూడా ప్రత్యేక అధికారుల బృందం ప్రస్తుతం విచారిస్తోంది. అందులో భాగంగానే వికాస్ దూబేతో బలమైన సంబంధాలు ఉన్నట్లుగా భావిస్తున్న ఎస్సై శర్మనూ అధికారులు విచారించారు. అయితే వికాస్ దూబేను యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు కనుక.. అతనికి సహాయం అందించానని ఆరోపిస్తూ.. తనను కూడా పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తారేమోనని భయంగా ఉందని శర్మ చెబుతూ కోర్టును ఆశ్రయించడం సంచలనం కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో నేర చరిత్ర ఎక్కువగా ఉన్న వారిని సీఎం యోగి సర్కారు ఎన్‌కౌంటర్ చేస్తోంది. అందుకనే శర్మ బాగా భయపడి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోర్టుకు వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. కాగా దీనిపై కోర్టు స్పందించాల్సి ఉంది.