రాజకీయాల్లో ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ వినియోగించుకునేందు కు రాజకీయ పార్టీలు ఎప్పుడూ రెడీగానేఉంటాయి. అయితే, అవకాశాలు లేనప్పుడు.. అప్పుడు కూడా అవకాశాలు సృష్టించుకుని దాడులు చేయడం టీడీపీ అధినేత చంద్రబాబు వంటి వారికి కామన్. ఇప్పుడు జగన్ ప్రబుత్వంపై ఆయన, ఆయన పరివారం ఇదే తరహాలో దాడులు చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళ్తే.. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకతా లేదు. ఇటీవల విద్యుత్ చార్జీలను పెంచారనే ఆందోళన వ్యక్తమైనా.. ప్రభుత్వం వివరించి చెప్పడంతో ప్రజలు అర్ధం చేసుకున్నారు.
దీంతో ఏ విషయంలోనూ ప్రభుత్వాన్ని వంక పెట్టే అవకాశం చంద్రబాబుకు ఆయన పార్టీకి లేకుండా పోయింది. పైగా ఆయన పిలుపు నిస్తున్నా.. ఎవరూ కూడా నిరసనలకు, ఆందోళనలకు ముందుకు రావడం లేదు. దీంతో పార్టీ ప్రభ నానాటికీ తగ్గుముఖం పడుతోంది. అదేసమయంలో తన పార్టీపై వైసీపీ నాయకు లు రెచ్చిపోతున్నారు. పైగా ప్రభుత్వం నుంచి ఏదో ఒక రూపంలో కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి పార్టీ పైచేయి సాధించేందుకు కృషి చేస్తున్నారు. దీంతో వైసీపీలో కీలక నాయకులు.. గట్టి గళాలుగా ఉన్న కొందరిని ఏరికోరి ఎంపికచేసుకుని వారిపై యుద్ధం ప్రకటించాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, కన్నబాబు, కొడాలి నాని కేంద్రంగా టీడీపీ ఆరోపణల పర్వానికి తెరదీసింది. ఇక, మిగిలిన నాయకుల విషయానికి వస్తే.. తమ పార్టీలోనే ఉంటూ.. వైసీపీకి మద్దతు తెలిపిన వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం వంటివారిని కూడా టార్గెట్ చేసుకుందనే సమాచారం అందింది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే నాయకులతో వారిపై విమర్శలు చేయించడం, అనుకూల మీడియాలో వ్యతిరేక కథనాలు ప్రచారం చేయడం, వంటి వాటిపై అధినేత చంద్రబాబు దృష్టి పెట్టారని అంటున్నారు. ఇలా వైసీపీలో గళాలను టార్గెట్ చేసుకుంటే.. కొంత వరకైనా తమ పార్టీపై వ్యతిరేక ప్రభావం తగ్గుతుందని అంటున్నారు. మరి ఈ వ్యూహం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.