టీడీపీ స్పీక్స్ : సీన్లోకి కాల్వ శ్రీ‌నివాసులు.. చాలా రోజుల‌కు మీడియా ముందుకు!

-

తెలుగుదేశం పార్టీలో జ‌ర్న‌లిస్టులు ప‌దువులు అందుకున్న రోజులున్నాయి. ఆ మాట‌కు వ‌స్తే వైసీపీలో కూడా ఉన్నాయి. అక్క‌డ కాల్వ శ్రీ‌నివాసులుకు ఎంత పేరుందో, ఇక్క‌డ కుర‌సాల క‌న్న‌బాబుకు అంతే పేరుంది. ఇద్ద‌రి నేప‌థ్యం ఈనాడు జర్న‌లిజం స్కూల్ కావ‌డం విశేషం. ఓ విధంగా మంచి స్నేహితులు కూడా వీరిద్ద‌రూ. ముఖ్యంగా జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల‌పై వీలున్నంత వ‌ర‌కూ స్పందింస్తారు.ఆ కోవ‌లో ఆ తోవ‌లో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్, అనంత రాజ‌కీయాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే కాల్వ శ్రీ‌నివాసులు చాలా రోజుల‌కు మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడ‌డం చ‌ర్చ‌కు తావిస్తోంది.

TDP Party | తెలుగుదేశం పార్టీ

గ‌తంలో ఓ ప్ర‌ముఖ దిన ప‌త్రిక‌లో స్టాఫ్ రిపోర్ట‌ర్ గా పనిచేసిన ఆయ‌నకు జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల‌పై మంచి అవ‌గాహ‌న ఉంది. హిందూపురం కేంద్రంగానే కాదు అనంత వాడ‌ల్లో ప‌ల్లె ప‌ల్లె కూ తిరిగి రిపోర్టింగ్ చేసిన అనుభ‌వం ఉంది.

సైకిల్ తొక్కుకుంటూ రిపోర్టింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయ‌ని కాల్వ శ్రీ‌నివాసులు గ‌తంలో ఈనాడు ఆదివారం అనుబంధంతో చెప్పిన మాటలు ఆ రోజు ఆస‌క్తిరేపాయి. జ‌ర్న‌లిస్టుల‌ను గౌర‌వించే సంస్కారం ఉన్న వ్య‌క్తిగా ఆయ‌నకు పేరుంది. చిన్న‌వాళ్ల‌ను ప్రేమ పూర్వ‌కంగానే చూస్తారు. ముఖ్యంగా స్థానిక విలేక‌రులు, గ్రామీణ విలేక‌రులు వారి ప‌నితీరు వీటిపై కూడా ఆయ‌న ఆరా తీస్తుంటారు.

ఇక నిన్న‌టి వేళ మంత్రి చెల్లుబోయిన వేణు కాస్త అత్యుత్సాహంతో చేసిన వ్యాఖ్య‌ల‌పై కాల్వ శ్రీ‌నివాసులు స్పందించారు. స‌మాచార శాఖ మంత్రి హోదాలో ఉన్న ఆయ‌న అటువంటి అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం త‌గ‌దు అని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం పొలిట్ బ్యూరో స‌భ్యులుగా ఉన్న ఆయ‌న నిన్న‌టి వేళ మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించారు.

ముఖ్య‌మంత్రిని ఆరాధిస్తే జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాలు వ‌స్తాయి అని చెప్పిన మాట కాస్త వివాదాల‌కు తావిచ్చింది. ఆయ‌న ఉద్దేశం సానుకూల వైఖ‌రితో పాత్రికేయం చేస్తే జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌లు ప‌రిష్కృతం అవుతాయి అని చెప్పాల‌నుకున్నారేమో కానీ అది కాస్త అటు తిరిగి ఇటు తిరిగి ఆరాధిస్తే, అభిమానిస్తే లాంటి ప‌దాలు చేరి వివాదానికి తావిచ్చింద‌ని విప‌క్ష స‌భ్యులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇవాళ జ‌ర్న‌లిస్టులు అనేక స‌వాళ్లు ఎదుర్కొంటున్నార‌ని, వాటిని అధిగ‌మించేందుకు ఎంతో శ్ర‌మిస్తున్నార‌ని ఈ త‌రుణంలో బాధ్య‌త ఉన్న మంత్రి ఈ విధంగా వ్యాఖ్య‌లు చేయ‌డం త‌గ‌ద‌ని ఆయ‌న హిత‌వు చెప్పారు. అదేవిధంగా కాస్త క‌టువుగానే కాల్వ స్పందిస్తూ..ఓ విధంగా మంత్రి మాట‌లు అవ‌మానక‌ర రీతిలోనే ఉన్నాయ‌ని త‌క్ష‌ణ‌మే జ‌ర్న‌లిస్టుల‌కు ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version