చింతమనేని ప్రకటన టీడీపీని ఇరకాటంలో పడేసిందా ?

-

దెందులూరు మాజీ ఎమ్మెల్యే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి చుక్కలు చూపించారు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌. ఇప్పుడు టీడీపీ విపక్షంలో ఉంటే సొంత పార్టీకే తలనొప్పిగా మారారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల సమయంలో ఏలూరులో కార్పొరేషన్‌లో టీడీపీ అభ్యర్థులను బరిలో దించలేకపోవడం ఒక ఎత్తు అయితే.. బరిలో ఉన్న బీజేపీ, జనసేన క్యాండిడేట్స్‌కు మద్దతుగా ప్రచారం చేస్తానని ప్రకటించి టీడీపీని ఇరకాటంలోకి నెట్టారు.


తొందరపడ్డారో.. తడబడ్డారో కానీ సొంత పార్టీ అభ్యర్థులను కాపాడుకోలేక.. బరిలోఉన్న పక్కపార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని చెప్పడంతో టీడీపీలోనూ చర్చకు కారణమయ్యారు చింతమనేని. అయినదానికి కానిదానికి నేనున్నాను అని వివాదాల్లో తల దూర్చే చింతమనేని వల్ల పశ్చిమగోదావరిజిల్లాలో పార్టీకి నష్టం జరిగిందన్నది టీడీపీ వర్గాలు చెప్పేమాట. ఇప్పుడు కూడా టీడీపీ అభ్యర్థులను బరిలో దించలేక.. పక్కపార్టీ అభ్యర్థులకు ప్రచారం చేస్తామంటున్నారు. అదేమంటే టీడీపీ తరఫున అభ్యర్థులు లేరు కదా అని ఆయనే ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికల్లో పోటీ చేయాలి.. గెలవాలి అని ఏ పార్టీ అయిన కోరుకుంటుంది. దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న టీడీపీ ఎన్నో ఎన్నికలు చూసింది. పోటీ చేసింది. కానీ..ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మద్దతుదారులను నిలుపుకోలేకపోయింది. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. అధికారపార్టీ ఏకగ్రీవం చేయాలని చూస్తోంది.. ఆ దిశగా తమ పార్టీ నేతలను ప్రోత్సహిస్తోంది. ఇలాంటి ప్రతికూల రాజకీయ వాతావరణంలో సహజంగానే టీడీపీ తరఫున నామినేషన్లు వేయడానికి వెనకాడతున్నారు నాయకులు. అలా అని వారిని వదిలేస్తారా అని ప్రశ్నిస్తున్నారు తమ్ముళ్లు.

ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పలుడివిజన్లలో టీడీపీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు. చింతమనేని పర్యవేక్షిస్తోన్న 25వ డివిజన్‌లోనే టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. ఇలాంటి సమయంలో ఆ ప్రాంత టీడీపీ నేతలకు అండగా నిలబడటం.. బరిలో ఉండేలా చూడటం.. మీ వెనక నేనున్నాను అని చెప్పకుండా చేతులు ఎత్తేయడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యపరుస్తోంది. పైగా టీడీపీ అభ్యర్థులు బరిలో లేని చోట.. పోటీలో ఉన్న జనసేన, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తానని చింతమనేని చెప్పడం సొంతపార్టీ శ్రేణులను ఇరకాటంలో పడేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version