తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అపూర్వస్పందన వస్తుంది. నెల్లూరు జిల్లాలో లోకేశ్ చేపట్టిన యువగళం మహా పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ ముందుకు సాగుతున్న లోకేశ్.. పాదయాత్రకు నేటికి 127వ రోజు… ప్రతీ వంద కిలోమీటర్లకు ఆ ప్రాంతానికి సంబంధించి ఒక్కో హామీ ఇచ్చుకుంటూ వస్తున్నారు. యువతతో ముఖాముఖి సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాజకీయం కోసమే జిల్లాలను విడగొట్టారని విమర్శించారు. జిల్లాలను అశాస్త్రీయంగా విభజించారని తెలిపారు. దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈసారి టీడీపీ రావడం ఖాయమని, తాము అధికారం చేపట్టాక ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నారా లోకేశ్ చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. విదేశీ విద్య కోసం వెళ్లే వారికి ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక పోలీసు నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. కాలేజీ నుంచి విద్యార్థి బయటకు వచ్చే సమయానికి పూర్తి నైపుణ్యాలు సంతరించుకుని ఉండాలని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఇక, తాము అధికారం చేపట్టగానే కార్పొరేషన్లను బలోపేతం చేస్తామని, ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.