ప్రమాదవశాత్తు ఓ స్కూల్‌లో టీచర్ ఉండే స్టాఫ్ రూం స్లాబ్ కూలిపోవడంతో టీచర్ మృతి చెందిన విషాద ఘటన పంజాబ్‌లో చోటు
చేసుకుంది. ఈ సంఘటనలో ఒక మహిళా టీచర్ మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రక్షించాయి. పంజాబ్‌లోని లూథియానా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బద్దోవాల్ గ్రామంలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాల పైకప్పు బుధవారం కూలింది. స్టాఫ్ రూమ్ పైనున్న స్లాబ్ కూలడంతో ఆ గదిలో ఉన్న నలుగురు ఉపాధ్యాయులు శిథిలాల కింద చిక్కుకున్నారు.
కాగా, ఈ సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఆ స్కూల్ వద్దకు చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న టీచర్లను బయటకు తీశారు. తీవ్రంగా గాయడిన మహిళా టీచర్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. గాయపడిన మరో ముగ్గురు టీచర్లకు చికిత్స అందిస్తున్నారు. స్లాబ్ కూలినప్పుడు విద్యార్థులు కూడా స్కూల్‌లోనే ఉన్నారు. అయితే వారికి ఏ ప్రమాదం జరుగలేదు.
మరోవైపు 1960లో నిర్మించిన ఆ ప్రభుత్వ స్కూల్ శిథిలావస్థతకు చేరుకున్నది. దీంతో రెండో అంతస్తులో మరమ్మతు పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి అంతస్తులోని స్లాబ్ పెచ్చులు ఊడి కింద ఉన్న స్టాప్ రూమ్ స్లాబ్‌పై పడ్డాయి. దీంతో ఆ స్లాబ్ కూలినట్లు తెలుస్తున్నది. కాగా ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు తెలిపారు.