భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బెంగుళూరు వేదికగా జరిగిన మూడో, నిర్ణయాత్మక వన్డేలో టీం ఇండియా ఆదరగొట్టింది. తొలి వన్డే ఓటమికి రెండో వన్డేలో ప్రతీకార౦ తీర్చుకున్న టీం ఇండియా మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సీరీస్ సొంతం చేసుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరి, కెప్టెన్ విరాట్ కోహ్లి 89 పరుగులతో అబ్బురపరిచే ఆట తీరుతో కంగారు జట్టుకి చుక్కలు చూపించారు. దీనితో 2-1 తో టీం ఇండియా సీరీస్ సొంతం చేసుకుంది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టుకి ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ శుభారంభం ఇవ్వలేదు. మూడో ఓవర్లోనే ఓపెనర్ డేవిడ్ వార్నర్ ని శమి మూడు పరుగులకే అవుట్ చేసాడు. ఆ తర్వాత సిక్స్ ఫార్ తో దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన ఫించ్, సమన్వయ లోపంతో ఊహించని విధంగా రనౌట్ కావడంతో 46 పరుగులకే ఓపెనర్ల ఇద్దరి వికెట్లను ఆస్ట్రేలియా కోల్పోయింది.
ఆ తర్వాత సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్, యువ ఆటగాడు లభూషనేతో కలిసి ఇన్నింగ్స్ ని నిర్మించాడు. ఇద్దరు కలిసి దాదాపు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని జడేజా విడగొట్టాడు. 31వ ఓవర్ మూడో బంతికి కోహ్లి అద్భుతమైన క్యాచ్ లభుషానే వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన స్తార్క్ జడేజా బౌలింగ్ లోనే డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్ ఒంటరి పోరాటం చేసాడు.
అలెక్స్ క్యారీతో కలిసి దాదాపు 6౦ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేదు. ఈ క్రమంలో స్మిత్ తన వన్డే కెరీర్ లో 9వ సెంచరి నమోదు చేసాడు. 132 బంతుల్లో ఒక సిక్స్ 14 ఫోర్ల సాయంతో 131 పరుగులు చేసిన స్మిత్ శమీ బౌలింగ్ లో స్కోర్ పెంచే క్రమంలో అయ్యర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఆసిస్ 286 పరుగులు చేసింది.
ఆ తర్వాత మోస్తరు లక్ష్య చేధనతో బరిలోకి దిగిన టీం ఇండియాకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. ధావన్ కి గాయం కావడంతో ఓపెనర్ గా వచ్చిన రాహుల్ 19 పరుగులు చేసి నిరాశ పరచగా ఆ తర్వాత వచ్చిన కోహ్లి తో కలిసి మరో ఓపెనర్ రోహిత్ శర్మ 150 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆచితూచి ఆడుతూ ఇద్దరు స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ తన వన్డే కెరీర్ లో 29వ శతకం పూర్తి చేసాడు.
ఆ తర్వాత వేగంగా ఆడే క్రమంలో, 128 బంతుల్లో ఆరు సిక్సులు, 8 ఫోర్ల సాయంతో 119 పరుగులు చేసిన రోహిత్ శర్మ, జంపా బౌలింగ్ లో స్తార్క్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రోహిత్ ఉన్నప్పుడే కెప్టెన్ కోహ్లి అర్ధ సెంచరి పూర్తి చేసాడు. ఆ తర్వాత వచ్చిన యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ (35 బంతుల్లో సిక్స్ 6 ఫోర్ల సాయంతో 44 పరుగులు) తో కలిసి కోహ్లీ జాగ్రత్తగా ఆడుతూ విజయం అంచుల వరకు తీసుకువెళ్ళాడు.
విజయానికి మరో 13 పరుగులు అవసరం అనుకున్న తరుణంలో హెజిల్ వుడ్ బౌలింగ్ లో 91 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 89 పరుగులు చేసి కోహ్లీ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండే తో (4 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 8 పరుగులు) కలిసి అయ్యర్ పని పూర్తి చేసాడు. దీనితో మరో 7 వికెట్లు, 15 బంతులు మిగిలి ఉండగానే టీం ఇండియా విజయం సొంతం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మకు దక్కింది. ఈ నెల 24 నుంచి టీం ఇండియా న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా తొలి వన్డే ఆడనుంది.