గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ ఉభయసభల్లో చర్చ జరగనుంది. శాసనసభ, శాసనమండలి ఉదయం 10 గంటలకు సమావేశం అవుతాయి. రెండు సభల్లోనూ ఇవాళ ప్రశ్నోత్తలను రద్దు చేశారు. దీంతో నేరుగా చర్చ చేపడతారు. రెండు సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిన్న చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెడతారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీర్మానాన్ని ప్రతిపాదించనుండగా.. మరో శాసనసభ్యుడు వివేకానందగౌడ్ బలపరుస్తారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించునుండగా… మరో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ బలపరుస్తారు. ఆ తర్వాత అన్ని పక్షాలు చర్చలో పాల్గొంటాయి. అనంతరం చర్చకు ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. బీఏసీ సమావేశ నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఉభయ సభల ముందు ఉంచనున్నారు. పలు సంస్థల వార్షిక నివేదికలను సంబంధిత శాఖల మంత్రులు సభ ముందు ఉంచనున్నారు.